టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన‍్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ప్రకటన చేశారు.
‘ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రిస్తున్నాయి. మాపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్ముజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించం. జాతీయ భద్రత రక్షణ కోసం హర్ముజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవడమే మా లక్ష్యం. జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్ కృషి చేసింది‘ అని అన్నారు.
దీంతో ఇరాన్ విధించిన ప్రత్యేక షరతులను పాటిస్తూ నౌకలు హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ పెట్టిన నియమాలు, పరిమితులను పాటించాల్సిందేనని చెప్పింది.
కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఆ విమానాశ్రయం నుంచి వెళ్లే, వచ్చే అన్ని విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యే వరకు ప్రయాణం చేయవద్దని ప్రయాణికులకు సూచించారు.
హోర్ముజ్ జలసంధి పర్యవేక్షణ కోసం కూటమిలో చేరాలని సుమారు ఏడు దేశాలను అడిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇరాన్‌లో ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది.


