యుద్ధంతో పశ్చిమాసియా రావణకాష్టంలా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కాస్తా ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందింది. అయితే ఇది ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా లేక శతాబ్దాల నాటి సరిహద్దుల విస్తరణా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. లెబనాన్‌ను కబళిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని నెతన్యాహు లక్ష్యం ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ వైపు మళ్లుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
15 రోజుల్లో 20 శాతం భూభాగం కబ్జా?
గడచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎప్) లెబనాన్ సరిహద్దుల్లో ఊహించని వేగంతో ముందుకు సాగింది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని సుమారు 20 శాతం భూభాగాన్ని ఖాళీ చేయించడం వెనుక భారీ వ్యూహం దాగివుంది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడం పేరుతో ఇజ్రాయెల్ అక్కడ శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు మరణించడంతో ఈ ప్రాంతం శ్మశానవాటికను తలపిస్తోంది.
ఏమిటీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ కల?
బైబిల్ కాలం నాటి ‘ప్రామిస్డ్ ల్యాండ్’ (వాగ్దాన భూమి) సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలనేది కొందరు అతివాద ఇజ్రాయెలీ నాయకుల తీవ్ర ఆకాంక్ష. దీనినే ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లేదా 'అఖండ ఇజ్రాయెల్' అని పిలుస్తారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ లోని కొన్ని భాగాలను కలుపుకోవాలి. నెతన్యాహు తాజా దాడులు ఈ పాత మ్యాప్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.
హిజ్బుల్లా అణచివేత.. ఇరాన్ లక్ష్యంగా పావులు
ఇజ్రాయెల్‌కు అసలైన శత్రువు ఇరాన్ అని నెతన్యాహు నమ్ముతారు. ఇరాన్ అండతో నడుస్తున్న హిజ్బుల్లాను బలహీనపరచకుండా లెబనాన్‌పై పట్టు సాధించడం అసాధ్యం. అందుకే ఒకవైపు క్షిపణి దాడులతో హిజ్బుల్లా వెన్ను విరుస్తూనే, మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోందని వశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ జోక్యం చేసుకోకుండా అడ్డుకోగలిగితే, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా మారుతుంది.
ట్రంప్ హయాంలో..
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన గత 13 నెలల్లో ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇరాన్ నేతలపై దాడులు, కఠినమైన టారిఫ్‌లు, ఇజ్రాయెల్‌కు బేషరతు మద్దతు ఇవ్వడం ద్వారా ట్రంప్ నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అమెరికా అండ ఉండటంతో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తోంది.
పశ్చిమాసియా మ్యాప్ మారుతోందా?
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణుల పోరాటం కాదు.. ఇది భౌగోళిక సరిహద్దుల మార్పిడి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ‘బఫర్ జోన్’ ఏర్పాటు ఇప్పుడు లెబనాన్ లోపలి వరకు చొచ్చుకుపోయింది. నెతన్యాహు వ్యూహం గనుక ఫలిస్తే, రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పటంలో లెబనాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
శాంతి చర్చలు సాధ్యమేనా?
ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు ఇరాన్ తన పట్టు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఇటు ఇజ్రాయెల్ తన లక్ష్యం నెరవేరకుండా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ మహా సంగ్రామం పశ్చిమాసియాను మరో పెను మార్పు వైపు నడిపిస్తోంది.
ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?


