ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా? | Top Indian Tech Talent Returning From Abroad Faces Outdated Notepad Coding Tests In Interviews | Sakshi
Sakshi News home page

ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?

Mar 16 2026 12:19 PM | Updated on Mar 16 2026 1:40 PM

Germany returned techies asked to write code on notepad

అహ్మదాబాద్: విదేశాల్లో భారీ ప్యాకేజీలు అందుకుంటూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసి, ఏవో కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారతీయ కంపెనీల్లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వంటి అత్యున్నత రంగాల్లో అనుభవమున్న టెక్కీలను ఇంటర్వ్యూల్లో ‘నోట్‌ప్యాడ్' మీద కోడ్ రాయమనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.

అసలేం జరిగింది?
అహ్మదాబాద్‌కు చెందిన ‘న్యూకాన్స్’ (Pneucons) సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ లఖానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఉదంతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతని  స్నేహితులిద్దరు గత ఐదేళ్లుగా జర్మనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఒకరు క్యాన్సర్ కణాలను గుర్తించే ఏఐ మోడల్స్‌ను రూపొందించగా, మరొకరు మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్‌) పైప్‌లైన్స్‌లో నిపుణుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం వారు తమ విదేశీ ఉద్యోగాలను వదిలి భారత్‌కు తిరిగివచ్చారు.

అయితే వారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే.. సదరు రిక్రూటర్లు వారి అనుభవాన్ని పక్కన పెట్టి, 2026వ సంవత్సరంలో కూడా ఒక సాధారణ ‘నోట్‌ప్యాడ్’ ఇచ్చి కోడ్ రాయమని అడగడం వారిని షాక్‌నకు గురిచేసింది. ‘క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ మోడల్స్ తయారు చేసే మేధావులను నోట్‌ప్యాడ్‌పై కోడ్ రాయమనడం హాస్యాస్పదం’ అని లఖానీ ఎద్దేవా చేశారు.

నెటిజన్ల రియాక్షన్: 'ఇది టెక్ ఇంటర్వ్యూనా.. జోకా?'
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘భారతీయ ఇంటర్వ్యూ వ్యవస్థ ఇంకా పురాతన కాలంలోనే ఉంది. 15 ఏళ్ల అనుభవం ఉన్నవాడిని కూడా లాజిక్ అడగకుండా, బట్టీ పట్టినట్టు కోడ్ రాయమనడం రిక్రూటర్ల అసమర్థతకు నిదర్శనం’ అని ఒకరు మండిపడ్డారు. ‘అనుభవం ఎంత ఉన్నా ప్రాథమిక అంశాలు ముఖ్యం. నోట్‌ప్యాడ్‌పై రాయడం వల్ల వారి సృజనాత్మకత, పట్టు అర్థమవుతుంది" అని మరికొందరు వాదించారు. మొత్తానికి ప్రపంచమంతా ఏఐ వేగంతో దూసుకుపోతుంటే, మన దగ్గర ఇంకా పాత పద్ధతులతోనే ప్రతిభను కొలవడం ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..

Advertisement
 
Advertisement
Advertisement