దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఏకంగా 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం.
అసలేం జరిగింది?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్షిపణి దాడులు లేదా రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించవద్దని యూఏఈ ప్రభుత్వం గతంలోనే స్థానికులను హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాజాగా యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ 25 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు (వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు). అంతకుముందు శనివారం పది మందిని (వీరిలో ఇద్దరు భారతీయులు) అరెస్ట్ చేశారు. మొత్తంగా 19 మంది భారతీయులు ఇప్పుడు జైలు పాలయ్యారు.
అరెస్ట్ అయిన వారిపై మూడు రకాల ఆరోపణలు..
నిందితులు మూడు గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు
క్షిపణుల వీడియోలు: ఆకాశంలో వెళ్తున్న క్షిపణులను లేదా వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి, వాటికి భయాందోళనలు కలిగించే శబ్దాలను జోడించి ప్రచారం చేయడం.
ఏఐ ఫేక్ దృశ్యాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఉపయోగించి పేలుళ్లు జరిగినట్లు కృత్రిమ వీడియోలను సృష్టించడం. ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా నమ్మించడం.
శత్రు దేశాలకు మద్దతు: యూఏఈ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలను, వారి సైనిక చర్యలను పొగుడుతూ పోస్టులు పెట్టడం.
శిక్షలు కఠినం: లక్ష దిర్హమ్‌ల జరిమానా
ఈ తరహా చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు, ఒక లక్ష దిర్హమ్‌లకు (సుమారు రూ. 22 లక్షలకు పైగా) తగ్గకుండా జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్, త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు


