దేశవ్యాప్త ఉత్కంఠకు తెరదించుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9 నుంచి మే 4 వరకు సాగే ఈ ‘ప్రజాస్వామ్య పండగ’లో విజయం ఎవరిదనే చర్చ అప్పుడే మొదలైంది. ఎన్నికల తేదీల ప్రకటన రాగానే ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు ప్రజాస్వామ్య రక్షణ నినాదాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
తమిళనాడు: ‘వారసత్వ రాజకీయాలకు చరమగీతం’
తమిళనాడులో ఈసారి చారిత్రాత్మక మార్పు రాబోతోందని ఏఐఏడీఎంకే (AIADMK) ప్రతినిధి కోవై సత్యన్ ధీమా వ్యక్తం చేశారు. ‘మే 4న తమిళనాడులో వారసత్వ పాలన అంతం కాబోతోంది’ అంటూ ఆయన అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ ఇస్తూ, డీఎంకే ఎంపీ ఎంఎం అబ్దుల్లా.. ‘డీఎంకే ఎప్పుడూ ఎన్నికల మూడ్‌లోనే ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది, గెలుపు మాదే’ అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత పీటర్ అల్ఫోన్స్ దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.
పశ్చిమ బెంగాల్: 'హింస లేని ఎన్నికలే మా లక్ష్యం'
బెంగాల్ రాజకీయం ఎప్పుడూ రణరంగాన్ని తలపిస్తుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అయితే బెంగాల్‌లో మా కార్యకర్తల హత్యలు మళ్లీ జరగకూడదు.. భయం లేని వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని కోరారు. కాగా, ఒపీనియన్ పోల్స్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) 150కి పైగా సీట్లతో ముందంజలో ఉండటం తృణమూల్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.
కేరళ: ‘వేసవి ఎండలో ప్రచార యుద్ధం’
కేరళలో ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు సిద్ధం కానీ, వేసవి ఎండల్లో ప్రచారం చేయడం అభ్యర్థులకు సవాలే. మా దగ్గర భారీగా ఖర్చు చేసేందుకు ఆర్థిక వనరులు లేవు. కానీ ప్రజల మద్దతు ఉంది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ తాము ఏడాది క్రితమే గ్రౌండ్ లెవల్‌లో ప్రిపరేషన్స్ మొదలుపెట్టామని, ఈసారి మార్పు ఖాయమని అన్నారు.
అస్సాం: ‘అభివృద్ధి వర్సెస్ ప్రజా మద్దతు’
అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందని బీజేపీ నేతలు అశోక్ భట్టారాయ్ లాంటి వారు నమ్మకంతో ఉన్నారు. ‘పంచాయతీ స్థాయి నుంచి మా కమిటీలు సిద్ధంగా ఉన్నాయి’ అని వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాత్రం ‘అస్సాం ప్రజలు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇస్తారు’ అని సవాల్ విసిరారు. ఇక్కడ కూడా ఒపీనియన్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.
బీజేపీ గెలుపు ధీమా: ‘ఐదు రాష్ట్రాల్లోనూ మాదే విజయం’
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "ఐదు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్డీఏ (NDA) భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది’ అని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీజేపీ నేతలు రాజీవ్ ప్రతాప్ రూడీ, వీరేంద్ర సచ్‌దేవా తదితరలు నొక్కి చెప్పారు. సామాన్యుల కష్టసుఖాల్లో తోడుగా ఉండే పార్టీగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
ఇది కూడా చదవండి: సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం


