సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం | LPG Gas Shortage Golgappas for Mid day Meal Chains Triggers Gas Cylinder | Sakshi
Sakshi News home page

సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం

Mar 16 2026 7:57 AM | Updated on Mar 16 2026 8:06 AM

LPG Gas Shortage Golgappas for Mid day Meal Chains Triggers Gas Cylinder

దేశంలో ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యునికి ఊపిరి ఆడనివ్వడం లేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సరఫరాలో అంతరాయాల వల్ల గ్యాస్ సిలిండర్ ఇప్పుడు సామాన్య వస్తువు కాదు.. ఒక విలాసవంతమైన వస్తువుగా మారిపోయింది. ఈ సంక్షోభం ఎంతటి వింత పరిస్థితులకు దారితీసిందంటే.. ఐఐటీ లాంటి విద్యాసంస్థల మెనూలు మారిపోయాయి.. సిలిండర్లకు సెక్యూరిటీ పెరిగింది.  ఇటువంటి ఆసక్తికర కథనాల సమాహారం మీకోసం..

సిలిండర్లకు ఇనుప గొలుసుల పహారా!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ‘వెల్వెట్ గార్డెన్’ లాంటి వంటి నివాస ప్రాంతాల్లో దొంగలు సిలిండర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు తమ సిలిండర్లను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వాచ్‌మెన్ క్వార్టర్లలో ఉండే స్టోర్‌ చేసే సిలిండర్లకు ఇనుప గొలుసులతో తాళాలు వేసి భద్రపరుస్తున్నారు. గ్యాస్ దొరకడమే కష్టమైన వేళ.. ఉన్న సిలిండర్లు దొంగలపాలైతే ఆకలితో అలమటించాల్సి వస్తుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఐఐటీ బాంబేలో 'నో ఫ్రైడ్.. ఓన్లీ ఐస్‌క్రీమ్'!
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన ఐఐటీ బాంబేలో గ్యాస్ కొరత కారణంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ వందలాది మంది విద్యార్థులకు భోజనం వండటం మెస్ నిర్వాహకులకు సవాలుగా మారింది. దీంతో వారు తమ మెనూని పూర్తిగా మార్చేశారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే వేపుడు పదార్థాలను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో గ్యాస్ అవసరం లేని ఐస్‌క్రీమ్‌లు, చల్లని పదార్థాలను అందిస్తున్నారు.

బడిలో పానీ పూరీల భోజనం!
పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో వంట చేయడం అసాధ్యం కావడంతో, పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పానీపూరీలను భోజనంగా అందించింది. అన్నం, కూరలకు బదులు చాట్ ఐటమ్స్ వడ్డించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్యాస్ సంక్షోభం చిన్నారుల ఆకలిపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

పెళ్లిళ్లలో గ్యాస్ తిప్పలు.. క్యాటరర్ల హైరానా!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత పెళ్లిళ్ల విందుపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసుల వారికి గ్యాస్ అందక సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల పెళ్లిళ్లలో భారీ విందులు ఏర్పాటు చేయడం కష్టతరం ​కావడంతో మెనూని కుదించడం లేదా గ్యాస్ అవసరం లేని వంటకాల వైపు మొగ్గు చూపడం జరగుతోంది. సిలిండర్లు దొరకక పోతే శుభకార్యాలు ఎలా నిర్వహించాలని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీధి వ్యాపారుల ఉపాధి గల్లంతు!
నగరాల్లోని స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న చిన్న హోటల్ నిర్వాహకుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సిలిండర్ల ధరలు పెరగడమే కాకుండా, అసలు సరఫరానే నిలిచిపోవడంతో వేలాది మంది వ్యాపారులు తమ బండ్లను మూసివేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసినా ఫలితం ఉండటం లేదని, ఫలితంగా తమ రోజువారీ ఆదాయం దెబ్బతింటోందని చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ ప్రభావం.. స్థానిక కష్టాలు!
ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. దీని ప్రభావంతోనే భారత్‌లో ఎల్‌పీజీ కొరత ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడం, ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి వంటగదిలో మంట ఆరిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంక్షోభంలో సామాన్యుడి పోరాటం!
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుల జీవనం మరింత దుర్భరంగా మారుతుందనడంలో సందేహం లేదు. సిలిండర్లకు తాళాలు వేసుకోవడం, వంటలు మానేసి ఐస్‌క్రీమ్‌లు తినడం వంటివి తాత్కాలిక పరిష్కారాలే కానీ, శాశ్వత పరిష్కారం కాదు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని, ధరలను అదుపులోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: ‘దళపతి’ మైండ్ గేమ్‌.. దిక్కుతోచని బీజేపీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement