ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ సరికొత్త టెక్నాలజీతో, ఆర్థిక విషయాలతో ఆశ్చర్యపరిచే చైనా.. ఇప్పుడు ఓ విచిత్రమైన ట్రెండ్‌తో వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లూ కేవలం వంటకాలకే పరిమితమైన కోళ్లు ఇప్పుడు అక్కడి ప్రధాన నగరాల్లో ముద్దులొలికే పెంపుడు జంతువులుగా మారిపోయాయి. ఏకంగా డైపర్లు వేసుకుని, వీధుల్లో షికారు చేస్తూ, ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారుతున్నాయి.
అగ్వాయ్ ‘ఫీనిక్స్ ఫెయిరీస్’
గువాంగ్‌డాంగ్ లాంటి ప్రాంతాల్లో కోడి కనిపిస్తే అది వంటకంలో ఉండాల్సిందే అన్న సామెత ఉంది. కానీ, అగ్వాయ్ అనే మహిళ తనకు బంధువులు ఇచ్చిన మూడు గుడ్లను పొదిగించి, ఆ కోడిపిల్లలను వండుకోకుండా ముద్దుగా పెంచుకుంటోంది. ఇవి అరుదైన, ఖరీదైన ‘తైహే బ్లాక్-బోన్డ్ సిల్కీ ఫౌల్’ జాతికి చెందినవి. మంచు లాంటి తెల్లటి ఈకలతో ఆకట్టుకునే వీటిని ‘ఫీనిక్స్ ఫెయిరీస్’ అని ముద్దుగా పిలుస్తారు. వీటి నిర్వహణ చాలా సులభమని, నెలకు కేవలం 30 యువాన్లు (సుమారు రూ. 450) మాత్రమే ఆహారం కోసం ఖర్చవుతుందని ఆమె తెలిపింది.
కుక్కలు, పిల్లుల కంటే ఇవే బెటర్
కోళ్లు చాలా తెలివైనవని, వాటికి ఎమోషన్స్ ఉంటాయని యజమానులు చెబుతున్నారు. జియాంగ్సు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కోడిపుంజు మనుషులతో భావోద్వేగాలను పంచుకుంటుందని, కళ్లతోనే కమ్యూనికేట్ చేస్తుందని తెలిపాడు. చిలుకలు, కుక్కలు, పిల్లులను పెంచిన అలిన్ అనే మరో యజమాని.. వాటన్నింటికంటే కోళ్లే మనుషులతో త్వరగా కనెక్ట్ అవుతాయని అంటోంది. సాధారణ పెంపుడు జంతువులకు అయ్యే ఖర్చు, వాటికి కేటాయించాల్సిన సమయం కంటే.. కోళ్ల నిర్వహణ చాలా సులభమని ఆమె అభిప్రాయపడింది.
ఎక్కడి నుంచి వస్తున్నాయి?
పెంపుడు జంతువులుగా మారుతున్న ఈ కోళ్లన్నీ ఎక్కువగా ఫారాల నుంచి వస్తున్నవే. గుడ్లు పెట్టలేని పుంజులు, మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని సూపర్ మార్కెట్లు ఎగ్స్, పెరుగు కొన్నవారికి ఆఫర్ల రూపంలో ఈ కోడిపిల్లలను ఉచితంగా ఇస్తుండగా.. రైతులు సిటీ పార్కుల్లో ఒకటి నుంచి మూడు యువాన్లకే అతి చవకగా విక్రయిస్తున్నారు. ఇది నగరవాసులను, ముఖ్యంగా పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోంది. చైనీయుల జీవనశైలిలో కోళ్లు కొత్త ఫ్యామిలీ మెంబర్స్‌గా మారిపోయాయి.
ఇది కూడా చదవండి: ‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’


