‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’ | Indian Army Marks Operation Sindoor Anniversary, Recalls 22 Minute Strike On Terror Network | Sakshi
Sakshi News home page

‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’

Apr 27 2026 9:33 AM | Updated on Apr 27 2026 10:20 AM

22 Minutes to Justice: Inside Operation Sindoor

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్‌ ఆర్మీ చేసిన ప్రకటన శత్రువుల గుండెల్లో గుబులు రేపుతోంది. కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ఎలా కుప్పకూల్చామో గుర్తుచేస్తూ.. ‘భారతదేశం దీనిని ఎప్పటికీ మర్చిపోదు’ అంటూ ఇండియన్ ఆర్మీ ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

పహల్గామ్ మారణహోమానికి ప్రతీకారం
కశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లిన 25 మంది పర్యాటకులను పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసిన ఈ మారణహోమానికి ప్రతీకారంగా 2025 మే 7న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ప్రతీకార దాడులకు దిగాయి. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మన సైన్యం ప్రణాళికాబద్ధమైన దాడులతో విరుచుకుపడింది.
 

100 మందికి పైగా ఉగ్రవాదుల హతం
ఈ ఆపరేషన్‌లో లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక, పౌర స్థావరాలపై ఎలాంటి దాడులు జరగలేదని, కేవలం ఉగ్రవాదుల కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని భారతదేశం స్పష్టం చేసింది. అయితే దెబ్బతిన్న పాకిస్తాన్ వెంటనే భారత సరిహద్దు పట్టణాలపై డ్రోన్ దాడులు, షెల్లింగ్‌కు దిగింది.

తోకముడిచిన పాక్.. కాల్పుల విరమణ
పాక్ దుశ్చర్యలతో రెండు పొరుగు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సైనిక సంఘర్షణ కొనసాగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత సైన్యం అత్యంత పటిష్టమైన రక్షణను కొనసాగించడమే కాకుండా, పాకిస్తాన్‌లోని అనేక బేస్‌లపై దాడులు చేసి వారి సైనిక, కమ్యూనికేషన్ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ భారీ నష్టాలను తట్టుకోలేక పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) భారత డీజీఎంఓను సంప్రదించారు. దీంతో మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, నాలుగు రోజుల యుద్ధానికి తెరపడింది.

ఇది కూడా చదవండి: అస్సాంలో ‘విజయ్’‌లాంటోడు?.. ఫలితాలను శాసిస్తూ..
 

Advertisement
 
Advertisement
Advertisement