ప్లీజ్‌ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్‌ ఖేర్‌ | Anupam Kher Shares Life Lesson After Judging Overweight Passenger | Sakshi
Sakshi News home page

అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్‌ ఖేర్‌

Jun 12 2026 10:36 AM | Updated on Jun 12 2026 2:04 PM

Anupam Kher Shares Life Lesson After Judging Overweight Passenger

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్‌ సరిగ్గా అలాంటి పనే చేశారు 

అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్‌ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్‌ ఖేర్‌. ఆ విమానంలో డేవిడ్‌ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్‌ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్‌ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. 

అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్‌. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్‌ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్‌ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్‌. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్‌. అందుకు డేవివ్‌ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్‌లైన్‌లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్‌ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. 

అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒ‍క్కసారిగా ఖేర్‌ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్‌. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. 

దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్‌తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్‌లో. అయితే నెటిజన్లు ఖేర్‌ మీరు చాలాగ్రేట్‌ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.

 

(చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్‌గా మార్చే ‘10-10-10’ రూల్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement