నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్‌గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్‌లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.
Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6
— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026
అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.

అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్‌ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్‌కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్‌చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది.
మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్‌మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్‌లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు.


