హైదరాబాద్: లైంగిక దాడి బాధితురాలి గోప్యత, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేస్తూ, ఆమె ప్రాథమిక గోప్యతా హక్కును భంగపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఉన్న 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణ జరిపిన జస్టిస్ బి విజయ్‌సేన్ రెడ్డి, యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ (గతంలో ట్విట్టర్) సంస్థలకు మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్‌కు సంబంధించిన గుర్తింపును వెల్లడించే, గోప్యతకు భంగం కలిగించే అన్ని అభ్యంతరకర డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
చట్టపరమైన విజ్ఞప్తులు చేసినప్పటికీ సోషల్ మీడియా దిగ్గజాలు స్పందించకపోవడంతో హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు న్యాయవాది నాగుర్‌బాబు ఎన్ తెలిపారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు నిరంతరం ప్రసారం కావడం వల్ల ఆమె గౌరవానికి తీవ్ర భంగం కలుగుతోందని వాదించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు మధ్యవర్తి సంస్థల గ్రీవెన్స్ అధికారులకు విన్నవించినా చర్యలు లేకపోవడంతో, రాజ్యాంగంలోని 14, 21 వ ఆర్టికల్స్, ఐటీ చట్టం-2000, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి హక్కులను రక్షించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు టెలికాం దిగ్గజాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అనుబంధం-ఎ లోని 200కు పైగా యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 20కి కోర్టు వాయిదా వేసింది.


