గృహజ్యోతి జీరో బిల్లు రావట్లేదా? కారణం ఇదే! | Gruha Jyothi zero electricity bills drop as power usage crosses 200 units | Sakshi
Sakshi News home page

గృహజ్యోతి జీరో బిల్లు రావట్లేదా? కారణం ఇదే!

Jul 26 2026 12:18 PM | Updated on Jul 26 2026 12:43 PM

Gruha Jyothi zero electricity bills drop as power usage crosses 200 units

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గృహజ్యోతి వినియోగదారులు విద్యుత్‌వాడకం 200 యూ నిట్ల పరిమితి దాటిపోతున్నారు. దీంతో జీరో బిల్లుకు దూరమై డబ్బులు కట్టుకోవాల్సి వస్తోంది. గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు లబ్ధిదారులకు కరెంట్‌ బిల్లు జీరో వస్తోంది. అయితే తమ పరిమితి దాటితే మాత్రం జీరో బిల్లు రాదు. దీంతో ఆ మేరకు ఆ నెలలో వచ్చిన బిల్లుమొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో చాలా మంది లబ్ధిదారులు గృహజ్యోతి పథకంలో అర్హులుగా ఉన్నారు. ఇందులో సొంతిల్లు కలిగిన వారితో పాటు అద్దె ఇంట్లో ఉన్నవారు సైతం సర్వీస్‌ నంబరుపై జీరో బిల్లు పొందుతున్నారు. అయితే తమ నెల వారీ విద్యుత్‌ వాడకం పెరిగితే మాత్రం జీరో బిల్లుకు దూరమవుతున్నారు.

వేలల్లో తగ్గుతున్న లబ్ధిదారులు
గృహజ్యోతి పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తయింది. జిల్లాలో మొదట నమోదైన వారితో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నారు. వీరిలో కొందరు వరసగా నెలల తరబడి 200 యూనిట్లు పైబడి విద్యుత్‌ వాడకం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. గత మార్చిలో వేసవి ఆరంభం నుంచి గత జూన్‌ వరకు దాదాపు 18 వేలకు పైగా గృహాలు జీరో బిల్లులకు దూరమయ్యాయి. దీంతో వారంతా ఈ మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. వేసవిలో ఎండలను తట్టుకోలేక చాలా మంది గృహాల్లో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లతో విపరీతంగా వాడారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఎండాకాలంలో రెండు నెలలు జీరో బిల్లులు పొందలేదు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడడం లేదు. దీంతో వేసవి తరహాలో వాడకం ఉంటోంది. చాలామంది పరిమిత యూనిట్లు దాటి వాడే అవకాశం ఉంటుంది. దీంతో వీరంతా జీరోబిల్లుకు బదులు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అయితే కొన్నిచోట్ల నెల దాటాక రీడింగ్‌ తీయడంతోనూ బిల్లులు పరిమిత యూనిట్లు దాటుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

లబ్ధిదారులే.. కానీ జీరో రాదు
గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం నిర్ణయించిన 200 యూనిట్ల పరిమితి దాటినప్పటికీ లబ్ధిదారుల జాబితాలోనే కొనసాగుతారు. అయితే నెలవారీగా జీరో బిల్లు మాత్రం రాదు. దీంతో మళ్ళీ పరిమితిలోపే విద్యుత్‌ వాడకం చేస్తేనే వారందరికీ ఆయా నెలల్లో జీరో బిల్లులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈక్రమంలో గృహల్లో విద్యుత్‌ వాడకం రోజువారీగా పొదుపుగా వాడితేనే లబ్ధిదారులకు ఈ పథకం నిరంతరాయంగా కొనసాగి, ప్రయోజనం కలగనుంది.

వేసవి నుంచి గృహజ్యోతి

బిల్లులు పరిశీలిస్తే..

నెల జీరో బిల్లులు

మార్చి 1,30,451

ఏప్రిల్‌ 1,24,817

మే 1,17,380

జూన్‌ 1,12,011

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement