వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్‌ | Shubman Gill Blames Bowlers For Indias ODI Series Defeat In England | Sakshi
Sakshi News home page

వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్‌

Jul 20 2026 1:45 AM | Updated on Jul 20 2026 10:34 AM

Shubman Gill Blames Bowlers For Indias ODI Series Defeat In England

భార‌త పురుష‌ల క్రికెట్ జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌ను ఓట‌మితో ముగించింది. ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలోనూ ఇంగ్లండ్ చేతిలో 27 ప‌రుగుల తేడాతో టీమిండియా ప‌రాజ‌యం పాలైంది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆతిథ్య జ‌ట్టుకు భార‌త్ స‌మ‌ర్పించుకుంది.

నిర్ణ‌యాత్మ‌క మూడో వ‌న్డేలో భార‌త్ బ్యాటింగ్ ప‌రంగా రాణించిన‌ప్ప‌టికి బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (141), జేకబ్‌ బెతెల్‌ (91) దుమ్ములేపగా.. జో రూట్‌ (48 బంతుల్లో 74), జోస్‌ బట్లర్‌ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు. 

అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్‌ చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ(138) భారీ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. గిల్‌(77), విరాట్ కోహ్లి(74) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. అయితే మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ల నుంచి స‌హ‌కారం ల‌భించ‌క‌పోవ‌డంతో భార‌త్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు.బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ చివరి ఓవర్లలో రాణించలేకపోయామని గిల్ తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం మమ్మల్ని మేము తీవ్ర నిరాశపరిచింది. తొలుత బౌలింగ్‌లో విఫలమయ్యాం. పవర్‌ప్లేలో మా బౌలర్లు లూజ్ డెలివరీలు వేసి భారీగా పరుగులు ఇచ్చారు. పవర్‌ప్లే తర్వాత వారు మ్యాచ్‌ను పూర్తిగా వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. చివరి మూడు ఓవర్లలో మేమ ఏకంగా 60 పరుగుల వరకు సమర్పించుకున్నాం.  

అంతర్జాతీయ క్రికెట్‌లో అంత భారీగా పరుగులు ఇస్తే మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టం. అయినప్పటికి లక్ష్యాన్ని చేధిస్తామన్న నమ్మకం మాకు ఉండేది. 40 ఓవర్ల తర్వాత మా చేతిలో వికెట్లు ఉంటే మ్యాచ్‌ను గెలుచుకోవచ్చని అనుకున్నాం. వికెట్లు పడకుండా ఉండే చివరి 10 ఓవర్లలో 100 నుండి 110 పరుగులు చేయడం పెద్దం కష్టమేమి కాదు. 

పవర్‌ప్లే తర్వాత కూడా  రోహిత్ భాయ్ నేనూ  రన్‌రేట్ తగ్గకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాం. కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం కొంపముంచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరోసారి ఈ సీనియర్ ఆటగాళ్లు తమ క్లాస్ చూపించారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ ఆడిన తీరు అద్భుతం.  మ్యాచ్ చివర్లో వికెట్ చాలా నెమ్మదించింది, షాట్లు ఆడటం అంత సులువు కాలేదు. కానీ అలాంటి పిచ్‌పై కూడా రోహిత్  అదరగొట్టాడు" అని గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement