Photo Credit: FIFA
సాకర్ మెగా సంబరం ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విజేతగా అవతరించింది. న్యూయార్క్ వేదికగా మెస్సీ బృందాన్ని 1-0 గోల్ తేడాతో ఓడించి రెండోసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.
అదనపు సమయంలోని 106వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్ కొట్టడంతో స్పెయిన్ చాంపియన్‌గా నిలవగా.. అర్జెంటీనా హృదయం ముక్కలైంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీలో ఆసాంతం అద్భుత ప్రదర్శ కనబరిచిన స్పెయిన్ వ్యక్తిగత బహుమతుల జాబితాలోనూ సత్తా చాటింది.
ఈసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్‌ను ఫాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె గెలుచుకోగా.. మిగతా అవార్డులను మాత్రం స్పెయిన్ ఆటగాళ్లు కైవసం చేసుకున్నారు. అయితే, గోల్డెన్ బూట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ అవార్డుల గురించి మీకు తెలుసా?.. విజేతలను ఎలా నిర్ణయిస్తారు?.. ప్రైజ్‌మనీ ఉంటుందా?... పూర్తి వివరాలు మీకోసం
గోల్డెన్ బూట్ విజేత ఎంబాపె (Kylian Mbappe- ఫ్రాన్స్)
ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఎడిషన్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి దీనిని ప్రధానం చేస్తారు. ఈసారి ఎంబాపె పది గోల్స్ కొట్టడంతో పాటు నాలుగు అసిస్ట్‌లు అందించి గోల్డెన్ బూట్ గెలిచాడు. గత ప్రపంచకప్ అంటే 2022లోనూ ఎంబాపేకే ఈ అవార్డు దక్కింది.
గోల్డెన్ బూట్ సుమారు కిలో మేర బరువు ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేసి.. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. గణాంకాల ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. దీనిని 1930లోనే ప్రవేశపెట్టినప్పటికీ.. 1982 నుంచి భౌతికంగా అందిస్తున్నారు. ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫౌంటైన్ 1958 ప్రపంచకప్ టోర్నీలో 13 గోల్స్ కొట్టగా.. ఇప్పటికీ ఆ విషయంలో ఎవరూ అతడి దరిదాపుల్లోకి రాలేదు.
గోల్డెన్ బాల్ విజేత రోడ్రి (Rodri- స్పెయిన్)
ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫిఫా టెక్నికల్ స్టడీ గ్రూప్ (FSG)ఈ అవార్డు విజేతను నిర్ణయిస్తుంది. టోర్నీలోని ప్రతీ మ్యాచ్‌ను విశ్లేషించి.. సదరు మ్యాచ్‌లలో ప్రభావం చూపిన ఆటగాడికి దీనిని అందజేస్తారు.
జట్టు తరఫున గోల్స్, అసిస్ట్స్ చేయడం.. డిఫెన్స్‌తో ఆకట్టుకుకోవడం.. నాయకత్వ బృందంలో కీలకంగా వ్యవహరించడం.. ఇలా మొత్తంగా ఏ విధంగానైనా సరే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడికి గోల్డెన్ బాల్ దక్కుతుంది.
ఇక ఈ అవార్డు విజేతను నిర్ణయించే FSGలో ఫిఫా గ్లోబల్ ఫుట్‌బాల్ డెవలప్‌మెంట్ చీఫ్‌తో పాటు.. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, టెక్నికల్ డైరెక్టర్లు, సాకర్ అనలిస్టులు.. అదే విధంగా మీడియా ప్రతినిధులు కూడా భాగంగా ఉంటారు.
విజేత జట్టు తరఫు ఆటగాడికేనా?
అయితే, ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుందనుకుంటే పొరపాటు. 2014 ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడినప్పటికీ అత్యుత్తమ ఆటగాడిగా లియోనల్ మెస్సీకి ఈ అవార్డు దక్కింది. ఇక గోల్డెన్ బాల్‌తో పాటు సిల్వర్, బ్రాంజ్ బాల్స్ విజేతలను కూడా సాంకేతిక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.
తొలుత 1986లో దీనిని ప్రవేశపెట్టగా.. అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇక మెస్సీ ఒక్కడే 2014, 2022 టోర్నీలలో అత్యధికంగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.
గోల్డెన్ గ్లోవ్ విజేత ఉనై సైమన్ (Unai Simon- స్పెయిన్)
ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గోల్‌కీపర్‌కి ఈ అవార్డు అందజేస్తారు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన నైపుణ్యాలు, నిలకడైన ఆట తీరుతో ప్రభావం చూపిన ఆటగాడిని FSG ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది.
అత్యుత్తమ డిఫెన్స్‌తో ప్రత్యర్థులను అడ్డుకోవడం.. వారు గోల్స్ కొట్టకుండా ఆపడం.. జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపారన్న ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని విజేతను నిర్ణయిస్తారు. ఈసారి ఏడు క్లీన్ షీట్స్‌తో సైమన్ గోల్డెన్ గ్లోవ్ గెలిచాడు. గోల్డెన్ గ్లోవ్‌ను తొలుత 1994లో బెల్జియం ప్లేయర్ మిచెల్ ప్రెడ్‌హోమ్ గెలుచుకున్నాడు.
7 clean sheets. adidas Golden Glove winner. ⭐@adidasfootball pic.twitter.com/mME9QEIgNj
— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026
ప్రైజ్‌మనీ ఇస్తారా?
ఈ అవార్డులన్నీ ఆటగాళ్ల గుర్తింపునకు మాత్రమే. వారి ప్రదర్శనకు ప్రతిఫలంగా ట్రోఫీలు అందజేస్తారు. వీటికి ఫిఫా నుంచి ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. అయితే, స్పాన్సర్ల ద్వారా ఆటగాళ్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది.


