విజయవాడ : శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి.
జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగుతూనే ఉన్నాయి.
గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు.
అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్తులు, భక్త బృందాలు ఆలయ ప్రాంగణంతో పాటు కనకదుర్గనగర్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.


