న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో సరిహద్దు ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు.
సహజ వనరుల పాలన, శాంతి, భద్రత, సమృద్ధికి పునాది అనే అంశంపై జరిగిన ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, విడదీయరాని భాగమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న రాజ్యాంగ, చట్టపరమైన వాస్తవం ఇదేనని తేల్చిచెప్పారు.
కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఏకైక వివాదం భారత్ భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడమేనని హరీశ్ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందంపై మాట్లాడుతూ, ఈ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతున్న తరుణంలో పరస్పర విశ్వాసం, సద్భావనతో కూడిన సహకారం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. భారత్‌పై నిందలు వేయడం మాని, పాకిస్తాన్ తన దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు!


