ఆక్రమిత కశ్మీర్‌కు ప్రధాని కావాలనేదే నా ఆశ: నవాజ్‌ షరీఫ్‌ | PAK Nawaz Sharif expresses desire to become PM of PoK | Sakshi
Sakshi News home page

ఆక్రమిత కశ్మీర్‌కు ప్రధాని కావాలనేదే నా ఆశ: నవాజ్‌ షరీఫ్‌

Jul 23 2026 7:18 AM | Updated on Jul 23 2026 10:42 AM

PAK Nawaz Sharif expresses desire to become PM of PoK

లాహోర్‌: పాకిస్తాన్‌ ఆక్రమిత్‌ కశ్మీర్‌(పీవోకే)కు ప్రధాని మంత్రి కావాలనేదే తన కల అని మాజీ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. నవాజ్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌) పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. జూలై 27వ తేదీ నుంచి ఆగస్ట్‌ పదో తేదీ వరకు జరిగే పీవోకే ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ముజఫరాబాద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో నవాజ్‌ మాట్లాడారు. ‘నా సొంత ప్రావిన్స్‌ పంజాబ్‌ కంటే పీవోకే అంటేనే నాకు ప్రేమ ఎక్కువ. ఇది నా రెండో సొంతిల్లు. మా పూర్వీకులు ఇక్కడి నుంచే వలస వచ్చారు. ఈసారి ఎన్నికల్లో మా పార్టీ గెలిస్తే ఈ ప్రాంతానికి ప్రధానిని చేయాలని దేశ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ను కోరతా. ఇక్కడ ప్రధానిగా కొనసాగితే ఈ ప్రాంత అభివృద్ధిని స్వయంగా పర్యవేక్షించే భాగ్యం దక్కుతుంది’ అని నవాజ్‌ వ్యాఖ్యానించారు.  

పీఎంఎల్‌–ఎన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని నవాజ్‌ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ–కాశ్మీర్‌లో అంతర్భాగమేనని భారత్‌ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. 1994లో భారత పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం, పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న ఈ ప్రాంతం భారతదేశానికి చెందినదేనని, దానిపై భారతదేశానికే పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకేపై పాకిస్తాన్‌ చేసే రాజకీయ వ్యాఖ్యలు లేదా ఎన్నికలను భారత సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేవని పలుమార్లు స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement