గల్ఫ్‌లో డ్రోన్‌ వార్‌.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా | Iran Drone Strikes On CIA Sites Spark Mystery Over Possible Russian Technology Link, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో డ్రోన్‌ వార్‌.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా

Jul 23 2026 8:20 AM | Updated on Jul 23 2026 10:49 AM

Secret CIA Targets Hit US Intelligence Hunts for Russian Connection

గల్ఫ్‌ ప్రాంతంలో జరిగిన డ్రోన్‌ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్‌ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్‌ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.

ముఖ్యంగా ఇరాన్‌ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

CIA స్థావరాలే లక్ష్యంగా?
రాయిటర్స్‌ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్‌ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్‌ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్‌ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్‌లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్‌కు చెందిన ‘షహీద్‌’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

టెక్నాలజీ ఆ దేశానిదేనా?
అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్‌ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థను ఇరాన్‌ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్‌ జామింగ్‌తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

దాడుల వెనుక నిఘా సమాచారమా?
ఇరాన్‌కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్‌ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

రష్యా–ఇరాన్‌ బంధంపై కొత్త చర్చ
ఇప్పటికే రష్యా, ఇరాన్‌ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్‌లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇరాన్‌ డ్రోన్‌ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement