సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు కొనసాగుతుండగా.. జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఘర్షణల్లో పలువురు సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు నీట్ అంశంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ్టి మేజర్ హెడ్‌లైన్స్‌ను పరిశీలిస్తే..
ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. CJP నిరసనల్లో ఘర్షణలు నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీశాయి. జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో మంగళవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టాల్స్‌టాయ్ మార్గ్ వద్ద కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న CJP ఉద్యమం నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీపై ప్రారంభమైన CJP ఉద్యమం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ముంబైలో అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. నాగ్‌పూర్‌లోనూ నిరసనకారులను పోలీసులు తరలించారు. అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించడంతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ మధ్య వార్
నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. గత పదేళ్లలో 150కిపైగా పేపర్ లీక్‌లు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. పేపర్ లీక్‌ల విషయంలో రాహుల్ గాంధీ ఎంపిక చేసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన లీక్‌లను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నడ్డా స్పష్టం చేశారు.
ఇరాన్‌పై అమెరికా దాడులు 12వ రోజుకు.. హార్ముజ్‌పై పెరుగుతున్న టెన్షన్
మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా 12వ రాత్రి వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. తమపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు.. చమురు సరఫరాపై ఆందోళన
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధానికి కేంద్రంగా మారింది. ఈ మార్గంలో అంతరాయం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇరాన్–అమెరికా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.
ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగితే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందిస్తూ.. తమ దేశం చమురు విక్రయించలేని పరిస్థితి వస్తే ఈ ప్రాంతంలోని మరే దేశం కూడా చమురు ఎగుమతి చేయలేదని హెచ్చరించారు.
సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన
నీట్ నిరసనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని తెలిపారు.
పంచదార్లకు నో మైనింగ్ జోన్.. వైఎస్సార్సీపీ పోరాటానికి ఫలితం
అక్రమ మైనింగ్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్‌మెంట్, ఆపరేషన్ అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. పంచదార్ల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించకపోతే ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ గతంలో హెచ్చరించింది.
సీదిరి అప్పలరాజు అరెస్ట్‌తో పలాసలో ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పలరాజు అరెస్ట్‌ను నిరసిస్తూ పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాయి. మరోవైపు అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
జింబాబ్వేతో టీమిండియా తొలి టీ20 నేడు
ఇంగ్లండ్ పర్యటన తర్వాత టీమిండియా మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సొంతగడ్డపై జింబాబ్వే కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. యువ భారత్ జోరు చూపిస్తుందా? లేదంటే జింబాబ్వే షాక్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈరోజు ఫోకస్‌లో..
- ఢిల్లీలో CJP నిరసనలు.. పోలీసులతో ఘర్షణలు
- నీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ గాంధీ వార్
- పార్లమెంట్ సమావేశాలు.. నీట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధం.. మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు
- ఇరాన్‌పై అమెరికా 12వ రోజు దాడులు
- హార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు
- ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం
- సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై కీలక పరిణామం
- పంచదార్ల విషయంలో ఫలించిన వైఎస్సార్‌సీపీ పోరాటం
- మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అప్‌డేట్స్
- తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరికలు
మరిన్ని బ్రేకింగ్ అప్‌డేట్స్, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్‌తోనే ఉండండి.


