ఫలమా.. ఫలహారమా? | Crores Of Rupees Sanctioned For Hyderabad Bonalu Festival Arrangements | Sakshi
Sakshi News home page

ఫలమా.. ఫలహారమా?

Jul 23 2026 9:39 AM | Updated on Jul 23 2026 9:39 AM

Crores Of Rupees Sanctioned For Hyderabad Bonalu Festival Arrangements

బోనాల ఉత్సవ ఏర్పాట్లకు రూ.26 కోట్లు మంజూరు

జీహెచ్‌ఎంసీలో 444 చోట్ల పనులు

రాజేంద్రనగర్‌కే రూ.8.79 కోట్లు

సక్రమంగా వినియోగించాలంటున్న నగర వాసులు

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెత్తకుండా నిర్వహించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిద్ధమైంది. ఆరు జోన్లలో వివిధ సర్కిళ్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 444 పనులను గుర్తించి నిధులు మంజూరు చేశారు.

జోన్ల వారీగా ఇలా..  
కేటాయింపుల్లో రాజేంద్రనగర్, చార్మినార్‌ జోన్లకు సింహభాగం నిధులు దక్కాయి. రాజేంద్రనగర్‌ జోన్‌ పరిధిలో అత్యధికంగా 160 పనుల కోసం రూ.8.79 కోట్లు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా జంగమ్మెట్‌ సర్కిల్‌లో 96 పనులకు రూ.5.63 కోట్లు ఖర్చు చేయనున్నారు. చార్మినార్‌ జోన్‌లో 137 పనులకు రూ.8.65 కోట్లు మంజూరయ్యాయి. చార్మినార్‌ సర్కిల్‌లోనే రూ.3.98 కోట్లతో పనులు చేపట్టనున్నారు. గోల్కొండ జోన్‌లో 89 పనులకు రూ.5.95 కోట్లు, గోల్కొండ సర్కిల్‌లో రూ.2.54 కోట్లతో 27 పనులు చేపట్టనున్నారు. ఉజ్జయినీ మహంకాళి బోనాలకు కేంద్రమైన సికింద్రాబాద్‌ పరిధి లో 32 పనులకు రూ.1.35 కోట్లు మంజూరు చేశారు. శంషాబాద్‌ జోన్‌లో 20 పనులకు రూ.93.40 లక్షలు కేటాయించారు. ఖైరతాబాద్‌ ఈ జోన్‌లో కేవలం 6 పనులు గుర్తించి అత్యల్పంగా రూ.30.55 లక్షలు మంజూరు చేశారు.  

బిల్లులకు చిల్లు.. 
బోనాల ఏర్పాట్లకు నిధుల మంజూరు హర్షణీయమే.. కానీ.. ఈ సారైనా పనులు సక్రమంగా చేస్తారా? లేక గతంలో మాదిరిగానే బిల్లులతోనే ఫలహారంలా పంచుకుంటారా? అని నగర వాసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనుభవాలను పరిశీలిస్తే.. బోనాల ఉత్సవాల వేళ జీహెచ్‌ఎంసీ చేసే ఖర్చులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం పనులు కూడా పూర్తి చేయకుండానే, ఉత్సవాలు ముగిసిన వెంటనే 'పనులు పూర్తయ్యాయి’ అంటూ దొంగ బిల్లులు సృష్టించి ఖజానాను గుల్ల చేయడం పరిపాటిగా మారింది. చాలా ప్రాంతాల్లో పాత రంగులపైనే మళ్లీ నాసిరకం సున్నాలు చల్లడం, గుంతల రోడ్లకు మొక్కుబడిగా మట్టి కొట్టడం మినహా శాశ్వత పనులు చేసిన దాఖలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement