పాపులర్ అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ టోనీ క్లోర్ (Tony Klor) స్టీల్‌సిటీ జమ్‌షెడ్‌పూర్ అందాలకు ఫిదా అయిపోయాడు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వైరల్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్, ఇటీవల జార్ఖండ్‌లోని 'స్టీల్ సిటీ' జమ్‌షెడ్‌పూర్‌ను మొదటిసారిగా సందర్శించి, ఎంతగానో ముగ్ధుడయ్యాడు. మొదట ఇది తన ఇండియా బకెట్ లిస్ట్‌లో లేకపోయినా, ఈ నగరాన్ని చూశాక తనకిష్టమైన ప్రదేశాలలో ఒకటిగా మారిందని ఆయన ప్రశంసించడం విశేషంగా నిలుస్తోంది.
మెట్రో నగరాలు, ప్రశాంతమైన బీచ్‌లు, పర్వతాలు, ఎడారులు, దట్టమైన అడవుల వంటి ఊహించదగిన అన్ని రకాల ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. జైపూర్, గోవా, వారణాసి వంటి నగరాలు అంతర్జాతీయ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నప్పటికీ, అంతగా ప్రాచుర్యం లేని అనేక పట్టణాలు, వాటిలో చూడటానికి ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించవు. కానీ అనుకోకుండా స్టీల్ సిటీని సందర్శించిన టోనీ క్లోర్ జమ్‌షెడ్‌పూర్‌ను "భారతీయ పిట్స్‌బర్గ్" అని అభివర్ణించారు. టాటా స్టీల్ నిర్వహణలోనే నగరం ఇంత శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నడవడం చూసి అబ్బురపడ్డారు.
ఇక్కడ గోల్‌పహాడి ఆలయం, జూబ్లీ పార్క్, సాక్షి మార్కెట్, డిమ్నా లేక్ మరియు దొముహాని ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇక్కడి పచ్చదనం, పరిశుభ్రత, సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్రీడా రంగానికి ఇది అందించిన ఒలింపియన్లను గురించి తెలుసుకొని అభినందించారు. అంతేకాదు జార్ఖండ్‌పై తన అభిప్రాయం, అపోహలను తారుమారు చేస్తూ ప్రజలు అనుకునేదానికంటే ఈ రాష్ట్రం చాలా అందంగా ఉందని, జమ్‌షెడ్‌పూర్ ఒక వెలుగులోకి రాని "అరుదైన రత్నం" (underrated gem) అని టోనీ పేర్కొన్నారు. "నేను ఈ నగరం గురించి నా పిల్లలకు కూడా చెబుతాను" అని సోషల్ మీడియాలో రాశారు. టోనీ షేర్ చేసిన వీడియో నెటిజన్లను, ముఖ్యంగా జమ్‌షెడ్‌పూర్ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. తమ నగర అందాలను ఇంత చక్కగా చూపించినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


