భారత్‌లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా.. | Pakistanis see Jantar Mantar protests | Sakshi
Sakshi News home page

భారత్‌లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా..

Jul 23 2026 4:18 PM | Updated on Jul 23 2026 4:53 PM

 Pakistanis see Jantar Mantar protests

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనను గమనిస్తున్న పాకిస్థానీయుల్లో ఆసక్తితో పాటు అసూయ కనిపిస్తున్నాయి. "పాకిస్థాన్‌లో ఇలా నిరసనలు ఎందుకు జరగవు?" అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకులపై జరుగుతున్న నిరసనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. యువత ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు అవతల పాకిస్థానీయులు ఆశ్చర్యంతో వీటిని గమనిస్తున్నారు. పాటలు, నినాదాలు, ఉద్యమ లక్ష్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు.

క్రికెట్‌ కోసమైతే వస్తారు.. 
పాకిస్థాన్ యువత ఎందుకు వీధుల్లోకి రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆ దేశీయులు. ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద లైవ్‌ క్రికెట్ మ్యాచ్‌లు చూసే జనం.. అక్కడ ఇతర కారణాలపై (సమస్యలపై) మాత్రం ఎందుకు గుమిగూడడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే "పాకిస్థాన్‌లో అసలు ప్రజాస్వామ్యమే లేదు" అని కంటెంట్ క్రియేటర్‌ మహ్మద్ వలీద్ చెప్పిన మాటతో చాలామంది ఏకీభవిస్తున్నారు.

‘‘డాన్’’ పత్రిక మాజీ సంపాదకుడు సిరిల్ అల్మీడా జంతర్ మంతర్ నిరసనలను "రావల్పిండీకి హెచ్చరిక"గా అభివర్ణించారు. రావల్పిండి నగరంలోనే పాకిస్థాన్ సైన్య ప్రధాన కార్యాలయం ఉంది. తమ దేశంలో ఇలాంటి విప్లవం రావడం లేదని నిరాశ చెందుతున్నారు.

పోలీసుల దౌర్జన్యానికి వస్తే రెండు దేశాల్లోనూ పరిస్థితి ఒకేలా ఉంటుందని అంటున్నారు. వలీద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో భారత యువత నుంచి పాకిస్థాన్ యువత నేర్చుకోవాల్సిన విషయాలను వివరించారు. నిరసన చేయాలంటే పెద్ద స్థాయిలో చేయాలని ఆయన అన్నారు. "పాకిస్థానీయులు తమ సంకల్పాన్ని ఎప్పుడూ చూపలేరు. 'నాకు ఏమాత్రం పట్టదు' అనే ధోరణితో ఉంటారు. డిగ్రీ తీసుకుని దేశం వదిలి వెళ్లడంపైనే మాట్లాడుతుంటారు. ఇది ఓడిపోయిన వారి ప్రవర్తన" అని చెప్పారు.

బంగ్లా, భారత్‌లోనే నిరసనలు 
మరో పాకిస్థాన్ కంటెంట్ సృష్టికర్త నోమీ సయ్యద్ మాట్లాడుతూ.. "ఈ ఉపఖండంలో బంగ్లాదేశీయులు మార్పు తీసుకురాగలుగుతున్నారు. భారతీయులు నిరసన చేయగలుగుతున్నారు. పాకిస్థాన్‌లో మాత్రం అలాంటి వారు లేరు. మా దేశంలో ఇలాంటి విప్లవం ఎప్పుడూ రాదు" అని ఆయన అన్నారు.

మరో ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ మహ్వాష్ అజాజ్ మాట్లాడుతూ.. భారత్‌లోని నిరసనలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. "వందే మాతరం పాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరసన చేస్తారు. కానీ, పాకిస్థానీయులను మాత్రం ఇక్కడ వేర్పాటువాదులుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.

అయితే అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. మానవ హక్కుల పాత్రికేయురాలు అలిఫియా సోహైల్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ నిరసనల గురించి మీరు మాట్లాడే తీరు, భారత మీడియా భారత్‌లోని నిరసనల గురించి మాట్లాడే తీరులానే ఉంది" అని అన్నారు.

"భారత కంటెంట్ సృష్టికర్తలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటున్నారు. ఇక్కడ మాత్రం అణచివేతకు పాల్పడేవారి గొంతుకగా మారేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. వెన్నెముక లేని వర్గం" అని అబ్దుల్లా అనే ఎక్స్ యూజర్‌ పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement