లక్షలకు లక్షలకు ఖర్చుపెట్టి ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం భారతదేశంలో చాలా సాధారణంగా మారిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, అద్భుతమైన వేదికలు, విలాసవంతమైన విందులు, ఖరీదైన బహుమతులు లేని మధ్య తరగతి పెళ్లి వేడుకలు ఇటీవలి కాలంలో లేవు అంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఒక్కసారే కదా పెళ్లి ముచ్చట అని కొందరు, బంధు మిత్రుల్లో పరువు పోతుంది, ఎంత విలాసవంతంగా పెళ్లి చేస్తే, అంత గౌరవం అని మరికొందరు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు వెనుకాడరు.
కానీ శక్తికి మించి చేసే ఈ వేడుకలు ముగిసిన తర్వాత, అంత ఖర్చు పెట్టడం, అప్పుల పాలు కావడం సబబేనా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అందుకే నవతరం జంటల ఆలోచనలో మార్పు వస్తోంది. ఒక రోజు కోసం ఒంత భారీ ఖర్చు పెట్టే బదులు, నిరాడంబరంగా పెళ్లి ముచ్చటను ముగించి ఆ డబ్బును ఇల్లు కొనడం లేదా తమ ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవడం వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడిగా పెట్టేవైపు మొగ్గు చూపుతున్నారు. అలా యువత ఆలోచనలో మార్పు వస్తోంది అనడానికి ఒక టెకీ జంట పంచుకున్న స్టోరీనే నిదర్శనం.
బెంగళూరుకు చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, రూ. 20 లక్షలు కేవలం రెండు రోజుల్లోనే ఎలా మాయమైపోతుందో, కానీ దాని ప్రభావం చాలా కాలం పాటు ఎలా ఉంటుందో వివరిస్తూ ఈ చర్చను మళ్లీ రాజేశారు. కేపీఎంజీ , డెలాయిట్ సంస్థలలో మాజీ ఉద్యోగి మీనల్ గోయల్, ఇటీవల రూ. 20 లక్షల వివాహానికి అయ్యే సాధారణ ఖర్చులను వివరిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు.
పెళ్లి ఒక వేడుక మాత్రమే. కానీ ఆర్థిక భారంగా మారాల్సిన అవసరం లేదు. స్థోమతకు తగ్గట్టుగా వేడుక జరుపుకోండి, మంచి జ్ఞాపకాలను పదిలంగా దాచుకోండి. అప్పులతో కాదు. ఆర్థిక ప్రశాంతతతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించండి. అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని నిర్మించుకోండి అంటూ ఆమె పిలుపునిచ్చారు.
ఆమె లెక్కల ప్రకారం రూ.20 లక్షల పెళ్లి ఖర్చు ఇలా
భోజనాలకు – రూ.6 లక్షలు, వివాహ వేదిక (వెన్యూ) కోసం – రూ.5 లక్షలు
అలంకరణల కోసం – రూ.3 లక్షలు, ఫోటోగ్రఫీ కోసం – రూ.2 లక్షలు
వినోద కార్యక్రమాల కోసం – రూ.2 లక్షలు, ఇతర ఖర్చులు – రూ.2 లక్షలు
తాను పెళ్లి వేడుకలకు వ్యతిరేకం కాదంటూ ఉన్నంతలో అనవసర ఆర్థిక ఒత్తిడి లేకుండా ఎలా పెళ్లి చేసుకోవాలో మీనల్ గోయల్ వివరించారు. ఈ ఖర్చుల్లో చాలా వరకు తాత్కాలిక మైనవేననీ, పెళ్లి అయ్యాక వేదిక ఖాళీ, అలంకరణలన్నీ తొలగిస్తారు, విందు ఆరగించాక అతిథులు కూడా తమ ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ ఆర్థిక భారం మాత్రం మిగిలిపోతుంది అని చెప్పుకొచ్చారు.
అదే రూ.20 లక్షలు లేదా దాంట్లో కొంత మొత్తాన్ని ఈ క్రింది అవసరాలకు ఉపయోగింవచ్చో కూడా ఆమె సోదారణంగా వివరించారు. ఇంటి కొనుగోలుకు డౌన్ పేమెంట్, అత్యవసర నిధి (Emergency Fund), పెట్టుబడులు (Investments) భవిష్యత్తులో పిల్లల విద్య వంటి అవసరాల కోసం ఉంచుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్ : ఈయన్ని గుర్తు పట్టారా?
నెటిజన్ల రియాక్షన్
ఆమె పోస్టు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చాలా మంది, విలాసవంతమైన పెళ్లిళ్లు వ్యక్తిగత కోరిక కంటే సమాజ ఒత్తిడి వల్లనే జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఒక మహిళ ఈ అభిప్రాయాన్ని చెప్పడం చాలా అభినందనీయం. ఇలాంటి ఆలోచన ఉన్న మహిళలు ఎక్కువైతే మధ్యతరగతి యువకులు, వారి కుటుంబాలు పెళ్లి ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని ఒకరంటే, కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. అందుకే అవసరమైనంత ఖర్చు చేస్తాను, సారీ అని మరొకరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ


