మామిడి రసంలో పల్ప్‌ ఉంటేనే ట్యాక్స్‌ బెనిఫిట్‌ | GST Slash Pure Mango Juice Big Win for Farmers better Drinks for You | Sakshi
Sakshi News home page

మామిడి రసంలో పల్ప్‌ ఉంటేనే ట్యాక్స్‌ బెనిఫిట్‌

Jul 23 2026 2:09 PM | Updated on Jul 23 2026 2:35 PM

GST Slash Pure Mango Juice Big Win for Farmers better Drinks for You

మామిడి పానీయాల తయారీలో నిజమైన పండ్ల గుజ్జు (పల్ప్‌) శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ దానికి అనుగుణంగా జీఎస్టీ రాయితీలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పానీయాల్లో కనీసం 22-25 శాతం సహజసిద్ధమైన మామిడి గుజ్జును తప్పనిసరిగా వాడే ఉత్పత్తులకే 5 శాతం రాయితీ జీఎస్టీ స్లాబ్‌ను పరిమితం చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అంతకంటే తక్కువ గుజ్జు శాతంతో కృత్రిమ రుచులొచ్చేలా ఇతర రసాయనాలతో తయారుచేసే పానీయాలపై అధిక పన్ను విధించాలని స్పష్టం చేసింది.

లఖ్‌నవూలోని ఐసీఏఆర్‌-సబ్‌ట్రోపికల్‌ హార్టికల్చర్‌ పరిశోధనా సంస్థ (సీఐఎస్‌హెచ్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ టి.దామోదరన్‌ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సమర్పించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించక మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పతనమైన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

ధరల పతనానికి మూలాలు.. కమిటీ సిఫార్సులు

  • వాణిజ్య పానీయాల తయారీ సంస్థలు చాలా తక్కువ పరిమాణంలో నిజమైన పల్ప్‌ను ఉపయోగిస్తున్నాయి.

  • ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యానికి, పండ్ల సేకరణ సమయానికి మధ్య సమన్వయం ఉండడంలేదు.

  • అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లలో ధరలు హెచ్చుతగ్గులున్నాయి.

రైతులకు స్థిరమైన ఆదాయం అందించేందుకు ప్రతి సీజన్‌కు ముందే పంట దిగుబడి, ప్రాసెసింగ్ అవసరాలు, ఎగుమతుల అంచనాల ఆధారంగా రిపోర్ట్‌ ఇవ్వాలని నిపుణులు చెప్పారు. సూచనప్రాయమైన కొనుగోలు ధరలను ఖరారు చేసేలా 'సెంట్రల్ కోఆర్డినేషన్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ కమిటీ'ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం

ఈ సిఫార్సులు అమల్లోకి వస్తే పానీయాల తయారీ సంస్థలు 5 శాతం జీఎస్టీ ప్రయోజనం కోసం తోతాపురి మామిడి గుజ్జును కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల తోతాపురి పండిస్తున్న లక్షలాది మంది రైతులకు స్థిరమైన డిమాండ్, మెరుగైన ధర దక్కుతాయి. మరోవైపు, వినియోగదారులకు కృత్రిమ రసాయనాలు లేని ఆరోగ్యకరమైన జ్యూస్‌లు అందుబాటులోకి వస్తాయి. ఆహార శుద్ధి రంగాన్ని రైతు సంక్షేమానికి అనుసంధానించే ఈ ప్రక్రియ వేగంగా అమలైతే మామిడి సాగుదారుల కష్టాలకు పరిష్కారం లభిస్తుంది.

ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement