నా తండ్రిలా ఏ రైతూ ఇబ్బంది పడకూడదు
రైతు పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్
తాడేపల్లి రూరల్: ‘ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేయడం వల్లే మా నాన్న మృతి చెందారు’ అని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ చెప్పారు. బతుకుదెరువు నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఉజ్వల్ తండ్రి పద్మనాభరెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారనే సమాచారం తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సోమవారం నేరుగా విజయవాడలోని ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే తండ్రి మరణించడంతో భోరున విలపించారు.
ఉజ్వల్‌ను ‘సాక్షి’ పలకరించగా.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూసమీకరణలో మా పొలం తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటినుంచి మా నాన్న తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉండవల్లిలో ఏం జరుగుతోందో ప్రతిరోజూ నాతో చెబుతున్నారు. సీఆర్‌డీఏ అధికారులు రెండ్రోజుల క్రితం కొందరి భూములను బలవంతంగా లాక్కున్న విషయం నాతో చెప్పి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 1951 నుంచి పండించుకుంటున్న పంట పొలాల్ని ప్రభుత్వం లాక్కుంటుంటే ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. నా తండ్రిలాగా ఉండవల్లిలో ఎంతోమంది రైతులు ఉన్నారు.
ఇన్నిరకాల పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం రైతుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. ఐదేళ్ల క్రితం నా తల్లి చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్న పొలం చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. డయాలసిస్ పేషెంట్ అయినప్పటికీ మా నాన్న ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. భూములు లాక్కున్న నాటినుంచి ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చేరి గుండెపోటుతో నాన్న మృతి చెందారు. నా తండ్రిలా ఏ రైతూ ఇబ్బంది పడకూడదు. ఆయన పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు’ అని ప్రార్థించారు.


