విజయవాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు
విజయవాడ కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
సంబంధం లేని పనులు చేయిస్తున్నారని ఫిర్యాదు
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ‘రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కూడా సరిగా కల్పించడం లేదు. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. కుటుంబాలను ఎలా పోషించాలి?’ అంటూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కష్టాలను ఏకరవు పెట్టారు.
వార్డుల్లో అన్ని పనులు తామే చేయాలని, తమకు సంబంధంలేని పనులూ చేయిస్తున్నారని ఆరోపించారు. జీతాలు సైతం సక్రమంగా ఇవ్వడంలేదని, రెండు నెలలుగా పెండింగ్‌లో ఉంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ చూపి న్యాయం చేయాలన్నారు. అనంతరం కార్మికులను పోలీసులు కలెక్టరేట్‌లోకి అనుమతించగా, డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు అందించారు.
అన్ని పనులూ చేయిస్తున్నారు
అన్ని పనులూ చేయిస్తున్నారు. సంబంధం లేని పనులు చేయడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. భోజనం కూడా చేయనీయడం లేదు. సంబంధం లేకున్నా బెడ్‌షీట్‌లు మార్పిస్తున్నారు. రోగులు బెడ్‌పై విరోచనానికి వెళ్తే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు చేయాల్సిన పనులు కూడా మాతోనే చేయిస్తున్నారు. – మణి, పారిశుద్ధ్య కార్మికురాలు
సక్రమంగా జీతాలు చెల్లించాలి
జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. ప్రతిసారి జీతాల కోసం నిరసన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీస వేతనం అమలు చేయడం లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు.
– అఖిల, పారిశుద్ధ్య కార్మికురాలు


