తాడేపల్లి ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం వద్ద బైఠాయించిన గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లు
అనుమతిలేదంటూ ఈడ్చిపడేసి అరెస్టుచేసిన పోలీసులు
బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి పలు పోలీస్‌స్టేషన్లకు తరలింపు
పెనుగులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళా టీచర్లు
తాడేపల్లి ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఉద్యోగ భద్రత కోసం మెరుపు ఆందోళనకు దిగిన గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రోడ్డుపై బైఠాయించిన వీరిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపడేశారు. భారీగా మోహరించిన పోలీసులు ఈ టీచర్లను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో పలువురు మహిళా టీచర్లు సొమ్మసిల్లిపడిపోయారు.
దీంతో తోటి టీచర్లు వారికి సపర్యలు చేశారు. అయినా కనికరం చూపని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమపట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని, తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఆందోళన విరమించేదిలేదని అవుట్ సోర్సింగ్ టీచర్లు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 191 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 1,143 అవుట్ సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ చంద్రబాబు, లోకేశ్, సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీలో తమ పోస్టులు రద్దుకావడంతో విధుల నుంచి తొలగించకుండా తమను ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమిస్తామంటూ నమ్మబలికారని చెప్పారు. అయితే, ఈ ఏడాది వేసవి శెలవుల అనంతరం ఇప్పటివరకు తమను రెన్యువల్ (రెగ్యులర్) చేయకపోవడంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదన్నారు. దీంతో తాడేపల్లి గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గత నెలాఖరున మూడు రోజులపాటు రాత్రిపగలు నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గతనెల 23న మంత్రి చర్చలకు పిలిచి అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని వారు అల్టిమేటం ఇచ్చారు.


