బెంగళూరు: తమిళనాడులోని బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ దాసా అలియాస్ ‘కింగ్ మేకర్ దాసా’ పుట్టినరోజు వేడుకల్లో యలహంక బీజేపీ శాసనసభ్యుడు ఎస్ఆర్ విశ్వనాథ్ పాల్గొనడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నెలకుంట్ల పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోలో రౌడీషీటర్ దాసా కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సంబరాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ వేడుకల సమయంలో పోలీసులెవ్వరూ అక్కడ లేకపోవడం గమనార్హం.
చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన దాసాపై యలహంక, నెలమంగళ, దాసరహళ్లి ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా దాసా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఒక బెంగళూరు పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది ప్రజాప్రతినిధి స్వయంగా రౌడీషీటర్ వేడుకల్లో పాల్గొనడంపై నెటిజన్లు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాదానాయకనహళ్లి పోలీసులు స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!


