బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్ | Suspended BKTC Employee Arrested by SIT in Badrinath Temple Donation Theft Case | Sakshi
Sakshi News home page

బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్

Jul 13 2026 12:41 PM | Updated on Jul 13 2026 12:46 PM

Suspended BKTC Employee Arrested by SIT in Badrinath Temple Donation Theft Case

డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కీలక పురోగతి సాధించింది. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ)కి చెందిన సస్పెండైన ఉద్యోగి ప్రమోద్ నౌటియాల్‌ను ‘సిట్‌’ సోమవారం అరెస్ట్ చేసింది. డెహ్రాడూన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, సుమారు గంటపాటు విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గోపేశ్వర్ కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.

జూలై 2న ఆలయ విరాళాల లెక్కింపు సమయంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బీకేటీసీ ఇన్‌ఛార్జ్ టెంపుల్ ఆఫీసర్ యుధ్‌వీర్ పుష్పవాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్రీనాథ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆలయ సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు నౌటియాల్ రూ.500, రూ.100 కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణేలు, శాలిగ్రామ శిలలు, భక్తుల కానుకల కవర్లను అనుమానాస్పదంగా దాచడం, దొంగిలించడం బయటపడింది. లెక్కింపు గదికి, తన కార్యాలయానికి మధ్య నిందితుడు పలుమార్లు తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది.

మరోవైపు, తన సస్పెన్షన్‌ను, ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ నౌటియాల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని బీకేటీసీని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసుపై రాష్ట్ర పోలీసులు, ‘సిట్‌’తో పాటు గర్వాల్ కమిషనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు జరుపుతున్నాయి.

ఇది కూడా చదవండి: ‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement