న్యూఢిల్లీ: వియత్నాంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరనున్నాయి. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పర్యాటకులు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) చేరుకున్నారు. కాగా హోచి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్‌లైన్స్ (VN979) విమానంలో 15 మంది భారతీయుల మృతదేహాలను ముంబయికి తరలిస్తున్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ విమానం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:35 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా వెల్లడించింది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయబార కార్యాలయం వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ముంబయి చేరుకున్న తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించామని, బాధిత కుటుంబాలతో సమన్వయం చేసుకోవాలని కోరినట్లు పేర్కొంది. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా.. ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళ వాసులు ఉన్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
వియత్నాం పత్రిక 'విఎన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఫు క్వాక్ ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ‘ఓషన్ పెర్ల్ ఐలాండ్’ సంస్థకు చెందిన ఓ స్పీడ్‌బోట్ 36 మంది ప్రయాణికులతో ‘హాన్ మే రట్’ దీవి నుంచి ‘అన్ థోయ్’ రేవుకు వెళ్తుండగా ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.


