నగరాల్లో వాకింగ్ వెళ్లాలంటే విసుగొచ్చేస్తుంది. కొద్ది దూరం నడిచేటప్పటికే అలసట, చికాకు అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే రద్దీగా ఉండే రహదారులు, వీధులు, ఓ పక్క హారన్ మోతలలో హోరెత్తిపోతుంది. కాబట్టి హాయిగా నడవడం చాలా కష్టం. ఏ పార్క్ లేదా చక్కటి ఉద్యానవనం లాంటి ప్రదేశాల్లోనే ప్రశాంతంగా వాకింగ్ చేయగలం అంతే. కానీ భారత్‌లోనే ఓ నగరం వాకింగ్ అత్యంత అనుకూలమైంది. అక్కడ నడిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే..అలసట కూడా తెలియదు. మన దేశంలో ఎక్కడుందంటే ఆ నగరం..
పట్టణ ప్రాంతాలు ఎల్లప్పుడూ వాకింగ్‌కి అనుకూలంగా ఉండవనేది తెలిసిందే. భారత్‌లో ప్రతిచోటా ట్రాఫిక్, మరోవైపు ఫుట్‌పాత్‌లపై కూడా ద్విచక్రవాహనాలు దర్శనం ఇవ్వడంతో..నడకకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలే లేని ప్రశాంతమైన నగరం భారత్‌లో ఉంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగర్ తాన్య ఖనిజో ఆ నగరం గురించి నెటింట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చంది.
ఆమె తన వీడియోకి ‘భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం’ అనే క్యాప్షన్ జోడించి మరి ఆ నగరం విశేషాల గురించి వీడియోలో వివరించారు. అది ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంత రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ అని పేర్కొంది. తాన్యా పోస్ట్‌లో తన అభిప్రాయంలో, భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం ఇదే అని రాశారు. ఈ గ్యాంగ్‌టక్ భారతదేశంలోని పట్టణ నగరాలలో ప్రత్యేకంగా నిలిచే, పాదచారులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం.
నగరంలోని ఎత్తైన నడక మార్గాలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు వెళ్లిన నగరాలలో నడవడానికి అనుకూలమైన నగరం ఇదే. ఇక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించని, అంతరాయం లేని ఎత్తైన ఫుట్‌పాత్‌లు చాలానే ఉన్నాయన్నారు. నడుస్తున్నప్పుడు ఎంతో హాయిగా సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ హారన్ కొట్టారో ఏకంగా రూ. 1000 జరిమానా పడుతుందని తెలిపింది.
అందువల్ల ఈ నగరం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించింది. ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన సుదీర్ఘ నడకలను ప్రోత్సహిస్తుందని, అందువల్లే తాను తెలియకుండానే అరగంటపైనే నడిచానని సంబరంగా చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఇబ్బందికరమైన చూపులు లేదా వేధింపులకు గురికాకపోవడం వల్ల సురక్షితంగా భావిస్తారని పేర్కొంది. మహిళలు సోలాగా వాక్ చేయాలనుకుంటే ఈ నగరమే అత్యంత అనుకూలమైందని అంటోంది.
చివరగా వ్లాగర్ తాన్య నడవడానికి అనువైన ప్రాంతాల విషయంలో ఇంతటి ఉన్నత ప్రమాణాలు, మహిళల ప్రదేశాలకు ఇచ్చే గౌరవం, సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన తదితరాలను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోంది. నగరాలన్ని ఇలానే ఉంటే బాగుండును అంటూ తన వీడియోని ముగించింది. నెటిజన్లు కూడా నగరాన్ని అందరికీ నివాసయోగ్యంగా మార్చడానికి గ్యాంగ్‌టక్ చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ప్లీజ్ దీని గురించి మరి ఎక్కువగా ప్రచారం చేయకండి, లేదంటే ప్రజలంతా తండొపతండాలుగా వచ్చి ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కూడా పాడుచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం)


