వానాకాలం విన్నర్స్!
ఇంటి పనులు ఎప్పుడూ తగ్గవు... కానీ వాటి కష్టం మాత్రం తగ్గించొచ్చు! చిన్నగా కనిపించే ఇవీ అవసరమైనప్పుడు పెద్ద సహాయం చేస్తుంది. ఇంట్లో ఒక్కసారి చోటు దక్కితే చాలు... ‘ఇంతకాలం ఇవి లేకుండా ఎలా మేనేజ్ చేశాం?’ అనిపించే స్మార్ట్ గ్యాడ్జెట్లు ఇవే!
మ్యాజిక్ బ్యాగ్!
షాపింగ్‌కు వెళ్లినప్పుడు వాన పడితే... ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో సరుకులు! వాటిని తడవకుండా కాపాడేలోపే గొడుగే పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి టైమ్‌లో ఈ రోల్–అప్ షాపింగ్ బ్యాగ్. చూడటానికి చిన్న క్యాప్సూల్‌లా కనిపించే ఈ బ్యాగ్‌ను విప్పగానే పెద్ద షాపింగ్ బ్యాగ్‌గా మారిపోతుంది. పని అయిపోయాక మళ్లీ చుట్టి చిన్న కేసులో పెట్టేస్తే చాలు. దీనికి ఉన్న క్లిప్‌తో హ్యాండ్‌బ్యాగ్, పర్స్‌కి తగిలించుకుని ఎప్పుడూ వెంట తీసుకెళ్లొచ్చు. వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌తో తయారైన ఈ బ్యాగ్‌లో కూరగాయలు, పండ్లు, మందులు, రోజువారీ సరుకులు... ఇలా చాలానే తడవకుండా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వానాకాలంలో ‘అయ్యో... బ్యాగ్ తీసుకురాలేదే!’ అనే టెన్షన్‌కు ఫుల్‌స్టాప్ పెడుతుంది. ధర కేవలం రూ. 260 మాత్రమే!
చిట్టి వాషింగ్ మెషీన్!
చిన్న బట్టల కోసం పెద్ద వాషింగ్ మెషీన్‌ను ఆన్ చేయడం కాస్త ఓవర్ అనిపిస్తుందా? ముఖ్యంగా చిన్నారుల బట్టలు, లోదుస్తులు, సాక్స్ లాంటి వాటిని విడిగా ఉతకాల్సి వచ్చినప్పుడు ఈ మినీ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ మీ పనిని చాలా ఈజీ చేస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నా, పనిలో మాత్రం పెద్ద మెషీన్‌కే పోటీ ఇస్తుంది. బలమైన వాటర్ సర్క్యులేషన్‌తో దుమ్ము, చెమట, రోజువారీ మరకలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. సున్నితమైన వస్త్రాలకు ఎలాంటి హాని కలగకుండా ఉతకడం దీని ప్రత్యేకత. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ మినీ వాషింగ్ మెషీన్‌ను ఇంట్లోనే కాదు... ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, క్యాంపింగ్‌లకు కూడా వెంట తీసుకెళ్లొచ్చు. ఎల్‌ఈడీ డిజిటల్ డిస్‌ప్లేతో బ్యాటరీ స్థాయి, వాషింగ్ మోడ్‌లను సులభంగా చూసుకోవచ్చు. ధర రూ. 1,600 మాత్రమే!
క్షణాల్లో బట్టలు ఆరుతాయి!
వానాకాలంలో బట్టలు ఉతికేయడం ఈజీ... కానీ వాటిని ఆరేయడమే అసలు తలనొప్పి! ఒక్కోసారి కుర్చీలు, తలుపులు, కిటికీలు కూడా డ్రైయింగ్ స్టాండ్‌లా మారిపోతుంటాయి. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వచ్చింది ఈ 360 డిగ్రీల రొటేటింగ్ డ్రైయింగ్ స్టాండ్. ఈ ఒక్క స్టాండ్‌లోనే షర్ట్‌లు, ప్యాంట్లు, చీరలు, టవల్స్, సాక్స్, చిన్నారుల దుస్తులు.. ఇలా ఒకేసారి చాలా బట్టలను ఆరేయొచ్చు. 360 డిగ్రీలు తిరిగే డిజైన్ ఉండటంతో స్టాండ్‌ను కదపాల్సిన అవసరం లేదు. ఒకే చోట నిలబడి అన్ని వైపులా ఉన్న బట్టలను సులభంగా అందుకోవచ్చు. గాలి అన్ని వైపుల నుంచి తగలడంతో బట్టలు త్వరగా ఆరిపోతాయి. బట్టలు తీసేసిన తర్వాత ఈ స్టాండ్‌ను మడిచి మూలన పెట్టేస్తే చాలు. పెద్దగా స్థలం కూడా ఆక్రమించదు. బాల్కనీ, బాత్‌రూమ్, టెర్రస్, యుటిలిటీ ఏరియా... ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ధర రూ. 2,500.


