ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికా రంగం అయితే, నేటి ఆధునిక సమాజంలో సామాన్యుడి ఆయుధం, ఐదో స్తంభం 'సోషల్ మీడియా'. కోట్లాది మంది ప్రజలు తమ భావాలను పంచుకోవడానికి, పాలకుల తప్పులను ఎండగట్టడానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఒక వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, పాలకులలో జవాబుదారీతనాన్ని పెంచుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భిన్నమైన, తీవ్ర ఆందోళనకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది.
ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని, సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. ఇది కేవలం ఒక వర్గాన్నో, ఒక పార్టీ కార్యకర్తనో కట్టడి చేసే చర్య కాదు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను ఖూనీ చేసే కుట్ర. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసే హక్కు, విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూస్తుంటే విమర్శిస్తే అర్ధరాత్రి అరెస్టులు, ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి రాజ్యమేలుతోంది. ఇటీవల కాలంలో పోలీసులు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్లు, ప్రభుత్వ విమర్శకులను ఏరివేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు రాజ్యాంగ రక్షణల కంటే పాలకుల అజెండాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనేది స్పష్టమవుతోంది.
తాజాగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ మీడియాను క్రమబద్ధీకరించడం కాదు, పాలకులపై వస్తున్న వ్యతిరేక గొంతులను శాశ్వతంగా నొక్కేయడమేనని మేధావులు, హక్కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. తప్పులను సరిదిద్దుకోవాల్సిన పాలకులు, తప్పులను ఎత్తిచూపిన వారిపై పగబట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర యూట్యూబర్లపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టుల పరంపర అమానుష కాండను తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వ్యక్తిపై వరుసగా కేసులు పెట్టడం, ఒక కేసులో బెయిల్ రాగానే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో కేసులో అరెస్ట్ చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలు నిత్యకృత్యమయ్యాయి.
ఈ అణచివేత పర్వంలో కొన్ని ప్రధానమైన ఉదాహరణలను పరిశీలిస్తే వ్యవస్థ ఎంతలా దుర్వినియోగం అవుతుందో అర్థమవుతుంది. యూట్యూబర్లపై ‘ఉగ్రవాద’ ముద్ర వేయడం దారుణమైన విషయం. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు 'ప్రశ్న' యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ ను పోలీసులు ఐదు రోజుల్లో ఐదుసార్లు వరుసగా అరెస్ట్ చేశారు. కోర్టులు ఒకదాని తర్వాత ఒకటి బెయిల్స్ ఇస్తున్నా, అతను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడానికి ఏకంగా అత్యంత కఠినమైన 'ఉగ్రవాద నిరోధక చట్టం' UAPA కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట. కేవలం మాటలతో విమర్శలు చేసిన ఒక సామాజిక కార్యకర్తపై దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించాడనే నెపంతో దేశద్రోహం, ఉగ్రవాద చట్టాలు ప్రయోగించడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను, నెటిజన్లను కక్షపూరితంగా టార్గెట్ చేస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలపై పాత పోస్టులను వెలికితీసి, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కేసులు పెడుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలపై నిఘా ఉంచి, ఇళ్లకు వెళ్లి వేధించడం, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం వంటి పద్ధతులు నేడు ఏపీలో సాధారణమైపోయాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదు అని పదే పదే స్పష్టం చేశాయి. కక్షపూరిత రాజకీయం కోసం ఐపీసీ ప్రస్తుత బీఎన్ఎస్, ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయవద్దని కోర్టులు గైడ్‌లైన్స్ ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పోలీసులు పాలకుల మెప్పు కోసం చట్టాలను చుట్టాలుగా మార్చేస్తున్నారు.
ప్రభుత్వం అధికారికంగా మహిళల రక్షణ, అసభ్యకర పోస్టుల అదుపు పేరుతో చట్టాలను కఠినతరం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఆచరణలో అవి కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికే ఉపయోగపడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎంతటి దారుణమైన పోస్టులు పెట్టినా, మార్ఫింగ్ వీడియోలు చేసినా ఎలాంటి చర్యలు ఉండవు. కానీ, ప్రతిపక్ష లేదా తటస్థ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలును ప్రశ్నిస్తే మాత్రం ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ లోని కఠిన సెక్షన్లు తెరపైకి వస్తాయి. పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, మానసిక వేధింపులు, సోషల్ మీడియా కార్యకర్తలను నేరస్థుల తరహాలో మీడియా ముందు నిలబెట్టడం వంటి చర్యల ద్వారా సమాజంలో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. 'మేము చెప్పిందే వినాలి, మేము చేసిందే రాయాలి, ప్రశ్నిస్తే జైలు గదులు సిద్ధంగా ఉంటాయి' అనే అలిఖిత నియంతృత్వ విధానాన్ని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు.
తుపాకీ గుండ్లకైనా ఎదురొడ్డి నిలబడే శక్తి అక్షరానికి మరియు ఆలోచనకు ఉంటుంది. చరిత్రలో ఏ రోజూ అణచివేత శాశ్వతంగా గెలవలేదు. గతంలో సామాజిక మాధ్యమాల గొంతు నొక్కాలని చూసిన ఏ ప్రభుత్వమూ ప్రజా క్షేత్రంలో నిలబడలేకపోయింది. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పాలకులను సరైన దారిలో పెట్టే ఒక టానిక్ లాంటిది. దాన్ని విషంగా భావించి నెటిజన్ల మీద యుద్ధం ప్రకటించడం చంద్రబాబు ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇప్పటికైనా తన కక్షసాధింపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా విమర్శించే హక్కును గౌరవించాలి. అక్రమ అరెస్టులు, ఉపా వంటి కఠిన చట్టాల దుర్వినియోగాన్ని తక్షణమే ఆపాలి. లేనిపక్షంలో, ఈ రోజు నెటిజన్ల గొంతు నొక్కడానికి ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు, రేపు పాలకుల పతనానికి పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాను నిషేధించవచ్చు లేదా కట్టడి చేయవచ్చు.. కానీ ప్రజల మనసుల్లో రగిలే అసంతృప్తిని ఏ చట్టాలూ ఆపలేవు!
-కంచర్ల యాదగిరిరెడ్డి
మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ.


