న్యూఢిల్లీ: ఢిల్లీ పరిధిలోని రోహిణి జిల్లా ప్రత్యేక పోలీసు దళం తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు షూటర్లను అరెస్ట్ చేసింది. వీరు ఢిల్లీలో టార్గెట్ కిల్లింగ్‌కు పథక రచన చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం ముందుగా అందడంతో రోహిణి జిల్లా స్పెషల్ స్టాఫ్ వీరి కదలికలపై నిఘా ఉంచి, చివరకు అదుపులోకి తీసుకుంది.
భారీ నేరానికి కుట్ర
విదేశాల్లో ఉన్న నెట్‌వర్క్ ద్వారా ఈ షూటర్లకు ఆదేశాలు అందుతున్నాయని, వాటి ఆధారంగానే వీరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని సమాచారం. ఢిల్లీలో గతంలో జరిగిన పలు నేరాల్లో ఈ షూటర్లు నిందితులుగా ఉన్నారు. గతంలోనూ వీరు నిర్దేశిత లక్ష్యాలపై కాల్పులు జరిపిన ఘటనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోనూ లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై నిఘా
ఇటీవలే అమెరికాలోనూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అక్కడి దర్యాప్తు సంస్థలు గట్టి నిఘా పెట్టాయి. జూలై 7 నుంచి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)ఈ ముఠాపై ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో పాటు, అతడి ప్రధాన అనుచరులైన గోల్డీ బ్రార్, జగ్గూ భగవాన్‌పురియా నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారు.
గోల్డీ బ్రార్‌పై నజరానా
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ గోల్డీ బ్రార్‌పై కఠిన చర్యలకు సిద్ధమైంది. సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అరెస్టుకు అవసరమైన సమాచారం అందించిన వారికి 50,000 డాలర్ల (సుమారు రూ. 43 లక్షలు) బహుమతిని అందజేస్తామని ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు వంటి అనేక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నప్పటికీ, అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. అతడి గ్యాంగ్‌లో పెద్ద సంఖ్యలో షూటర్లు ఉన్నారు.


