మేఘాలయ: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారంరోజున ఒక ప్రైవేట్ నిర్మాణ స్థలంలోని ఓ బావిలో విషవాయువుతో ఐదుగురు మృతి చెందారు.
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పోలీసు అధిపతి వివేక్ సియెమ్ తెలిపిన వివరాల ప్రకారం.. లాపాలాంగ్ ప్రాంతంలోని ప్రైవేట్ స్థలంలో ఉన్నటువంటి బావిలో నలుగురు కూలీలు నీరు తోడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. బావిలో ఉన్నటువంటి జనరేటర్ నుంచి విషపూరిత వాయువు వెలువడింది. ఈ పొగ కారణంగా వారికి ఊపిరాడక అక్కడే కుప్పకూలారు. అయితే, వీరిని రక్షించేందుకు అదే ప్రాంతంలో నివసించే ఇద్దరు సొంత సోదరులు బావిలోకి దిగారు. దీంతో దట్టమైన పొగ ఎక్కువవడంతో వారుకూడా అందులోనే చిక్కుకుపోయారు. ఎలాగోలా ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తక్షణమే రెస్క్యూ టీంతో రక్షణ చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఈ విషాదకర దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే, పోస్టుమార్టం నుంచి ఖచ్చితమైన నివేదికలు వచ్చిన తరువాతే మరణాలకు గల అసలు కారణాలేంటో స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.


