సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈరోజు తెల్లవారుజామున ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఫిలింనగర్ సైట్ 2 రోడ్ నంబర్ 5 లో ఉదయం 4 గంటల సమయంలో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటు బద్దలు కొట్టి లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న యువకులు ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫెరారీ స్పోర్ట్స్ కారును క్రేన్ సహాయంతో టోయింగ్ వెహికల్ లో ఫిలింనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ ప్రమాదం మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా? లేదంటే నెగ్లిజెన్సీ రాష్ డ్రైవింగ్ కారణమా? ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


