కొల్లూరులో 2 బీహెచ్‌కే ఇళ్లు ఇవ్వండి | Telangana HC Orders 2BHK Houses for 71 Evicted Bhimraobada Families at Kollur | Sakshi
Sakshi News home page

కొల్లూరులో 2 బీహెచ్‌కే ఇళ్లు ఇవ్వండి

Jul 12 2026 4:53 AM | Updated on Jul 12 2026 4:53 AM

 Telangana HC Orders 2BHK Houses for 71 Evicted Bhimraobada Families at Kollur

భీమ్‌రావ్‌బాడా స్లమ్‌ వాసులకు హైకోర్టు ఊరట 

రెండు నెలల్లో ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని సర్కార్‌కు ఆదేశం 

18 ఏళ్ల తర్వాత దక్కిన న్యాయం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లి భీమ్‌రావ్‌బాడా స్లమ్‌ వాసులకు కొల్లూరులో 2 బీహెచ్‌కే ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధి కారిక ఉత్తర్వుల కాపీ అందిన రెండు నెలల్లో కేటాయింపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్లమ్‌వాసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు మెరుగైన జీవన పరిస్థితు లు కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం సానుకూలంగా 2 బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపునకు ముందుకు రావడాన్ని అభినందించింది. పిటిషనర్లు కూడా ప్రభుత్వ ప్రతిపాదనను స్వచ్ఛందంగా అంగీకరించడంతో, వివాదంలోని ఇతర అంశాలపై తీర్పు ఇవ్వకుండా పరస్పర అంగీకారంతో కేసును ముగించడం సముచితమంటూ అభిప్రాయపడింది.

 ఈ మేరకు తీర్పు కాపీ విడుదల చేసింది. దీంతో 18 ఏళ్ల తర్వాత భీమ్‌రావ్‌బాడా స్లమ్‌ వాసులకు న్యాయం దక్కినట్లయింది. తమ ఇళ్లు తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ స్లమ్‌కు చెందిన కె.భారతితోపాటు 71 మంది హైకోర్టులో 2008లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుద్దాల చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు మల్లారెడ్డి గాడిపల్లి తదితరులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల పూర్వీకులు 60 ఏళ్లకు పైగా భీమ్‌రావ్‌ బాడా స్లమ్‌లో నివసిస్తున్నారని, 1991 లో ఆ ప్రాంతాన్ని అధికారికంగా స్లమ్‌గా ప్రకటించారన్నారు. 

అనంతరం కొందరికి డీ–ఫారం పట్టాలు కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఆ పట్టాలను రద్దు చేసి, 2008 లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 251 ద్వారా స్లమ్‌ను డీ–నోటిఫై చేసి, అక్కడి ప్రజలను అఫ్జల్‌సాగర్‌కు తరలించే చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ.. అఫ్జల్‌సాగర్‌లో నివాసానికి అనుకూల పరిస్థితులు లేకుంటే, కొల్లూరు సహా పలు ప్రాంతాల్లోని 2 బీహెచ్‌కే కాలనీల్లో ఇళ్లు కేటాయించేందుకు సిద్ధమని తెలి పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అర్హులైన ప్రతీ కుటుంబానికి  కొల్లూరు 2 బీహెచ్‌కే కాలనీలో ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేటాయింపునకు రెండు నెలలు గడువు విధిస్తూ, విచారణ ముగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement