కేసుల దర్యాప్తులో కీలకంగా ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’
వేగవంతమైన పనితీరుతో సులువుగా నేరాల నిరూపణ
నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో కీలక పాత్ర
ఆరు నెలల్లో..2469 కేసుల్లో నిందితులకు శిక్ష
సాక్షి, హైదరాబాద్: నేరాలపై పోలీసులు కేసు నమోదు చేయడం ఎంత ముఖ్యమో..ఆ నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేయడం మరింత మఖ్యం. నేరగాళ్లు తప్పించుకోకుండా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి..సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో సిటీ పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ కీలక పాత్ర పోషిస్తోంది. క్షేత్రస్థాయి దర్యాప్తును ఈ ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించడం, సాంకేతికతను జోడించడం వంటి చర్యల వల్ల కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు న్యాయస్థానాల్లో కన్విక్షన్ రేటు క్రమంగా పెరుగుతోందని సిటీ కమిషనర్ సజ్జనర్ అన్నారు.
ఇటీవల సనత్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన బాలుడి హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో పాటు పలు కీలక కేసుల కన్విక్షన్లలో ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ముఖ్యంగా పోక్సో కేసులు, మహిళలు, చిన్నారులపై జరిగే కేసుల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ఈ సెల్ పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
‘గతంలో తగినంత సమయం లేకపోవడం వల్లో, సాంకేతిక పరిజ్ఞానం కొరత వల్లో కొన్ని కేసుల దర్యాప్తులో చిన్నపాటి లోపాలు దొర్లేవి. దీనివల్ల నిందితులు కోర్టుల నుంచి సులువుగా తప్పించుకునేందుకు ఆస్కారం ఉండేది. ఈ సవాళ్లను అధిగమించడానికి రంగంలోకి దిగిన ‘మానిటరింగ్ సెల్’.. ప్రతి కేసును అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది. అనుభవజు్ఞలైన పోలీస్ అధికారులు, న్యాయ నిపుణులతో కూడిన ఈ విభాగం క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఒక దిక్సూచిలా నిలుస్తోంది.
నిందితుల అరెస్ట్, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, సాక్షుల గుర్తింపు వంటి కీలక దశల్లో శాస్త్రీయ పద్ధతులను అవలంబించేలా ఈ సెల్ అడుగడుగునా సహాయపడుతుంది’ అని సీపీ వివరించారు. నిర్దేశిత గడువు లోపల న్యాయస్థానాల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించడంతో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ కోర్టు విచారణ సజావుగా సాగేలా చూస్తోందని తెలిపారు.
ఇవీ ఫలితాలు..
గడచిన కొన్ని నెలల రికార్డులను విశ్లేషిస్తే, గ్రేవ్ (తీవ్రమైన), నాన్–గ్రేవ్ (సాధారణ) కేసులలో నేర నిరూపణల శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఆరునెలల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులన్నింటిలో కలిపి దాదాపు 2469 కేసులలో నిందితులకు కోర్టులు శిక్షలు ఖరారు చేశాయి. అందులో 18 కేసుల్లో 20 ఏళ్లకు పైగా శిక్షలు, 12 కేసుల్లో జీవిత ఖైదులు, ఒక కేసులో ఉరి శిక్షను కోర్టులు ఖరారు చేశాయి.


