సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాద్‌నగర్‌లో డ్రోన్లతో రీ సర్వే చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం (ఫైల్)
రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మండలాల్లోని ఒక్కో గ్రామం ఎంపిక
రైతులకు నోటీసులు.. అందులో తప్పుడు వివరాలతో గందరగోళం
ఇది సర్వే మాత్రమేనని.. పూర్తి స్థాయి రికార్డులు కావంటున్న యంత్రాంగం
ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూభారతి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మండలాల్లోని ఒక్కో గ్రామంలో చేపట్టిన భూముల రీసర్వే పైలెట్ ప్రాజెక్టు బాలారిష్టాలను దాటడం లేదు. ఈ ఏడాది మే నెలలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టారు.
ఆమనగల్లులో సర్వే మొదలు కాకపోగా.. మిగిలిన గ్రామాల్లో వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉన్న పేర్లు.. క్షేత్రస్థాయిలో లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఉంటే రికార్డుల్లో లేకపోవడం, వారసత్వంగా పంచుకున్న భూములు పహాణీల్లో లేకపోవడంతో గందరగోళం నెలకొంది. సర్వే ద్వారా ప్రతీ రైతు భూమికి మ్యాప్ ముద్రించి, సరిహద్దులు ప్రకటించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది పైలెట్ ప్రాజెక్టు లక్ష్యం.
ఎక్కడ చూసినా సమస్యలే..
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ప్రతీ గ్రామంలో సమస్యలు వెలుగు చూశాయి. పూర్వ కాలం నుంచి సరైన రికార్డులు లేకపోవడం, ప్రధానంగా వారసత్వ భూముల పంపకం పూర్తయినా, రికార్డుల్లో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
⇒ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడులో పండా ముత్యాలు కుటుంబానికి దశాబ్దాల కాలంగా సర్వే నంబరు 76లో 10 ఎకరాలు సాగుభూమి ఉన్నా హక్కు పత్రాలు లేవు.
⇒ సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాద్‌నగర్‌లో కొందరు రైతులకు పట్టాపాసు పుస్తకంలో ఉన్న దానికన్నా తక్కు వగా, ఇంకొందరికి ఎక్కువగా ఉంది. మరికొందరికి పట్టా ఉన్నా.. క్షేత్రస్థాయిలో లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఉన్నా పట్టా లేకపోవడం వంటి సమస్యలు వెలుగు చూశాయి.
అందరి ఆమోదంతోనే..
ఐదు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు సమస్యల తీవ్రతను చాటింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ని ఎకరాల భూమి, ఎవరి పేరుతో ఎంత, ప్రభుత్వ భూములు, ఆబాదీ భూములను ప్రాథమికంగా నిర్ధారించారు. రైతుల భూములకు సంబంధించి నోటీసులను ఇవ్వగా అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పూర్తి సర్వే తర్వాత సరిహద్దులు, సర్వే నంబర్లు నిర్ధారించి.. గ్రామసభల్లో రైతుల ఆమోదంతో రికార్డుల్లోకి ఎక్కిస్తారు.
వారసత్వ పట్టాలు లేక..
దురదపాడు గ్రామానికి చెందిన పాయం వీరస్వామి కొడుకు రామారావుకు వారసత్వంగా 1.5 ఎకరం, ఆయన సోదరుడు ధర్మరాజుకు 1.5 ఎకరం పంచి ఇద్దరికీ హక్కు పత్రాలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ పాత రికార్డులే కొనసాగుతున్నా యి. వారసత్వ పట్టాలు కాక పట్టాదార్ పేరిటే కొనసాగుతోంది. సర్వే అనంతరం హక్కు పత్రాలు వస్తాయని ఆశిస్తున్నారు.
వెలుగు చూసిన కొన్ని సమస్యలు
⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 3,784.01 ఎకరాల భూమి ఉంది. రైతుల భూములు పోగా.. సాగునీటి కాల్వలు 40.02 ఎకరాలు, ప్రభుత్వ భూము లు, ఆబాదీ (గ్రామ స్థలం, చెరువులు, రహదారులు, డొంక) 419.05 ఎకరాలు, పాస్‌బుక్‌లు లేని సాదాబైనామా 123.11 ఎకరాలు ఉన్నాయి. సర్వే ప్రకారం వేయి మంది రైతులకు నోటీసులు జారీ చేయగా, ఇంకో 400 మందికి ఇవ్వాల్సి ఉంది.
⇒ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడులో 15,975.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో సాగులో ఉన్న అసైన్డ్ భూమి 4,054 ఎకరాలు, పట్టా భూములు 267.21 ఎకరాలు, అటవీ భూమి 11,653.20 ఎకరాలు ఉన్నాయి. అయితే, సర్వే నంబర్ 76లో 1950–1976 ఏడాది మధ్యలో 15.19 ఎకరాలే రెవెన్యూ రికార్డుల్లో నమోదై మిగతాది అటవీ భూమిగా చూపుతోంది. దీంతో ఇక్కడ సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు లేవు.
⇒ సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాద్‌నగర్‌లోని 21 సర్వే నంబర్లలో 593.24 ఎకరాల భూవిస్తీర్ణం ఉండగా సర్వేలో 592 ఎకరాలే గుర్తించారు. రైతులకు నోటీసులు అందిస్తే 63 మంది అభ్యంతరాలు చెప్పారు.
⇒ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్‌లో 25 మంది రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని 13 భూసమస్యలను పరిష్కరించారు. ఇతర సమస్యలపై 12 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
⇒ రంగారెడ్డి జిల్లాలో మండల కేంద్రమైన ఆమనగల్లును పైలెట్‌గా ఎంపిక చేశారు. వారంక్రితం అవగాహన కోసం సదస్సు పెడితే తక్కువగా హాజరయ్యారు. ఆమనగల్లులోని 1,571 సర్వేనంబర్లలో 15,778 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో రైతులకు ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనేది సర్వే చేయనున్నారు.
ఎకరం 14 గుంటలే చూపుతున్నారు..
నా పాస్ పుస్తకంలో ఒక ఎకరం 29 గుంటలు ఉంటే.. సర్వే తర్వాత ఎకరం 14 గుంటలే చూపుతున్నారు. ఓ చోట 6 గుంటలు, మరో చోట 8 గుంటలు కొనుగోలు చేసి రికార్డుల్లో ఎక్కించుకున్నా. మొత్తం భూమి రికార్డుల్లో ఉన్నా నోటీసులో మాత్రం తక్కువగా చూపారు – సలిగంటి చిన్న మల్లయ్య, కాకరవాయి
పరిష్కారం చూపలేదు..
మా గ్రామంలో 40 ఎస్సీ కుటుంబాలకు సంబంధించి ఒకటే బిట్ ఉంది. 178, 111 సర్వే నంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమి ఉంది. దీనికి భాగ పరిష్కారం కావాలి. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా మా గ్రామం ఎంపికవడంతో దరఖాస్తులు పెట్టినా పరిష్కారం కాలేదు. ఆ భూమి ఇంకా మా ముత్తాతల పేరుతోనే ఉంది.
– సాయిలు, ఖాజీపూర్, మద్దూరు


