ఎల్‌బీనగర్– హయత్‌నగర్ మధ్య ప్రతిపాదనలు
ఎలివేటెడ్ కారిడార్‌పై నిర్మాణంతో అదనపు భారం
సాంకేతికంగా అసాధ్యం: నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు రూ.901 కోట్లతో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాదని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని, ఎలివేటెడ్, మెట్రో కారిడార్‌లు సమాంతరంగానే ఉంటాయని వెల్లడించాయి.
ఇప్పటికే మెట్రో రెండో దశ జాప్యం కారణంగా కి.మీ. దూరానికి రూ.270 కోట్ల నుంచి రూ.330 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం పెరగనున్నట్లు అంచనా వేశాయి. ఎలివేటెడ్‌పై మెట్రో కారిడార్ నిర్మాణంతో వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. పైగా ప్రయాణికుల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతుందని అధికారులు తెలిపారు. విస్తరణకు అవకాశం లేని ఇరుకు రోడ్లలో మాత్రమే ఇలాంటి డబుల్ డెక్కర్ ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందన్నారు.
కొలిక్కిరాని బీహెచ్‌ఈల్– గంగారం మార్గం
బీహెచ్‌ఈఎల్ నుంచి గంగారం వరకు డబుల్ డెక్కర్‌ను ప్రతిపాదించారు. జాతీయ రహదారుల సంస్థ ఇదే మార్గంలో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. డబుల్ డెక్కర్‌పై స్పష్టత ఇవ్వాలంటూ జాతీయ రహదారుల సంస్థ హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను కోరింది. కానీ రెండో దశకు అనుమతి లభించకపోవడంతో హామీ ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చేతులెత్తేశారు.


