సాక్షి, రంగారెడ్డి: షాబాద్ ఘటనలో పోలీసుల కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఆరుగురిని హత్య చేసిన పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్ కోసం 10 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం స్టేషన్ బెయిల్ మీద రాజ్‌కుమార్ బయటకు వచ్చాడు. ఓ కారు అద్దెకు తీసుకుని సరాసరి బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం జరిపాడు. ఆపై తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేశాడు.
ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు షాబాద్ చౌరస్తాలో ఈ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. "పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయేవి కావు" అంటూ గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ రమేశ్‌ను సస్పెండ్ చేశామని కలెక్టర్ తెలిపారు.


