సంగారెడ్డి వదిలేస్తా.. హరీష్‌పై పోటీ చేస్తా: జగ్గారెడ్డి ట్విస్ట్‌ | Leaving Sangareddy Ready to Take on Harish Rao: Jagga Reddy's Twist | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి వదిలేస్తా.. హరీష్‌పై పోటీ చేస్తా: జగ్గారెడ్డి ట్విస్ట్‌

Jul 11 2026 11:16 AM | Updated on Jul 11 2026 11:28 AM

Leaving Sangareddy Ready to Take on Harish Rao: Jagga Reddy's Twist

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు "సంగారెడ్డి నుంచి పోటీ చేయను.. అవసరమైతే రాజకీయాలకే దూరంగా ఉంటా" అని ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌కు వెళ్తే తన భార్య నిర్మల జగ్గారెడ్డే కాంగ్రెస్‌ అభ్యర్థి అవుతారని ఉద్ఘాటించిన ఆయన.. తాను మాత్రం మరో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ ట్విస్ట్‌ ఇచ్చారు.  

శనివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడి నుంచే బరిలో దిగుతానని చెప్పారు. రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకుడైనా పరిస్థితులకు, పార్టీ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. "ఎంత పెద్దపులి అయినా వేటగాడి వ్యూహంలో పడాల్సిందే.. ఓట్ల రాజకీయం కూడా అంతే. అందుకే నేను కూడా రెండు సార్లు ఓడిపోయా" అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో పార్టీ ఆదేశిస్తే సిద్దిపేటలో బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావుపై పోటీ చేయడానికీ వెనుకాడనని స్పష్టం చేశారు.

ఇటు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ప్రతి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, అధికార పార్టీని బలహీనపరచడం రాజకీయాల్లో సహజమేనని అన్నారు. రాజకీయాల్లో కౌంటర్‌, ఎన్‌కౌంటర్‌ కామనేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్‌ సొంత ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందని, అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారని చెప్పారు.

"ఎమ్మెల్యే పనితీరు బాగాలేకపోతే ఎంత తోపు నాయకుడైనా కాంగ్రెస్‌లో టికెట్‌ దక్కడం కష్టం. గతంలో ఎంతో బలమైన నాయకులుగా భావించిన వారు కూడా ఎన్నికల్లో మట్టికరిచారు" అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం హెచ్చరికలను ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని తమ లోపాలను సరిదిద్దుకోవాలని, లేకపోతే టిక్కెట్ల సమయంలో వారికే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేసే హక్కు సీఎంకే ఉంటుందని, తుది నిర్ణయాన్ని ఏఐసీసీ, రాష్ట్ర ఇన్‌చార్జి, సీఎం, పీసీసీ చీఫ్‌ కలిసి తీసుకుంటారని వెల్లడించారు.

రాబోయే ఎన్నికలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, ఆ అంచనాతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే 117కుపైగా స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షాల సర్వేలపై కూడా జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. "బీఆర్ఎస్‌కు అనుకూల వ్యక్తులతో సర్వే చేస్తే బీఆర్ఎస్‌కే అనుకూల ఫలితాలు వస్తాయి. తెలంగాణలో పెద్దగా బలం లేని బీజేపీ సర్వే చేయించినా బీజేపీకే అనుకూలంగానే ఉంటుంది" అని అన్నారు.

మొత్తంగా.. ఒకప్పుడు సంగారెడ్డి నుంచి తప్పుకుంటానన్న జగ్గారెడ్డి.. ఇప్పుడు అదే నియోజకవర్గంలో తన భార్యను బరిలో దించేందుకు సిద్ధమని చెప్పడం, తాను అవసరమైతే హరీష్‌రావుపై కూడా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్‌ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement