సాక్షి, ఏలూరు: ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న భీమవరం పర్యటనను.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌కు అనుమతులు నిరాకరించినా.. అవసరమైతే జగన్ రైలులో అయినా వచ్చి రైతులను కలుస్తారని పేర్కొన్నారు.
శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని బువ్వనపల్లిలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆక్వా మేత ధరలు భారీగా పెరిగినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మేత కంపెనీలు, పాలకులు కుమ్మక్కై రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు.
రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జూలై 15న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన ఖాయమైందని ఆయన వెల్లడించారు. పర్యటనను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌కు అనుమతులు ఇవ్వకపోయినా, ఇతర ఆంక్షలు విధించినా జగన్ వెనక్కి తగ్గరని, అవసరమైతే రైలులో ప్రయాణించి అయినా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్ని నాని పేర్కొన్నారు.
జగన్ పర్యటనతో ఆక్వా రైతుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారనున్నాయని, ప్రభుత్వం రైతుల డిమాండ్లపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


