మాట తప్పుడు.. పార్టీలు మారడం నీ సంస్కృతి | Harish Rao Sensational Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

మాట తప్పుడు.. పార్టీలు మారడం నీ సంస్కృతి

Jul 11 2026 5:36 AM | Updated on Jul 11 2026 5:36 AM

Harish Rao Sensational Comments On CM Revanth Reddy

రేవంత్‌ 20 ఏళ్ల రాజకీయ చరిత్రనే దానికి నిదర్శనం 

ఆయనలా ఒట్టు వేసి ఒక మాట, వేయకుండా మరోమాట చెప్పే అలవాటు నాకు లేదు : హరీశ్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: మాట తప్పడం..పార్టీలు మారడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సంస్కృతి కావొచ్చని, తనది కాదని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌ 20 ఏళ్ల రాజకీయ చరిత్ర, తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానమే అందుకు నిదర్శనమన్నారు. రేవంత్‌లా ఒట్టు వేసి ఒకమాట, ఒట్టు వేయకుండా మరోమాట చెప్పే అలవాటు తనకు లేదని చెప్పారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రం సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి సభ నిర్వహించిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా అని నిలదీశారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూ, మరోవైపు ప్రతి సభలో అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హరీశ్‌రావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్‌ చేయడం లేదు? 
కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ప్రస్తు తం లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులను ఆన్‌ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగంపై నమ్మక ద్రోహమేనని హరీశ్‌రావు ఆరోపించారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం కావాలనే వినియోగించడం లేదన్నా రు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని రిటైర్డ్‌ ఇంజనీర్లు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.

ఎల్లంపల్లి నుంచి సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు పెద్దఎత్తున నీరు అవసరమవుతుందని, ఆ పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు హెచ్చరికలు వస్తున్న సమయంలో లభ్యమవుతున్న ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్‌రావు తెలిపారు.  

ఏపీకి నీరు.. తెలంగాణకు నిర్లక్ష్యం 
తెలంగాణలో గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా, వాటిని వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలేయడం జలద్రోహమేనని హరీశ్‌రావు ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 24 మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తూ ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంటుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను ఆన్‌ చేయకపోవడం వెనుక చీకటి ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు.

దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లు ఉండగా ఒకటి, రెండు మాత్రమే నడపడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కన్నెపల్లి పంపులను ప్రారంభించి ఎల్లంపల్లి, అన్నారం, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌తోపాటు ఇతర రిజర్వాయర్లను నింపాలని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్‌ చేశారు. తెలంగాణలో భవిష్యత్‌లో తాగు, సాగునీటి సమస్యలకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు హెచ్చరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement