విజయ్‌ బర్త్‌డే వేడుకలపై ట్విస్ట్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. | Tamil Nadu high Court Notice To Govt Over Vijay Birthday Celebrations | Sakshi
Sakshi News home page

విజయ్‌ బర్త్‌డే వేడుకలపై ట్విస్ట్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

Jul 10 2026 7:56 AM | Updated on Jul 10 2026 7:56 AM

Tamil Nadu high Court Notice To Govt Over Vijay Birthday Celebrations

సాక్షి, చైన్నె: పాఠశాలలు, కళాశాలల్లో తమిళగ వెట్రి కలగం టీవీకే అధ్యక్షుడైన సీఎం విజయ్‌ జన్మదిన వేడుకలను నిర్వహించడంపై వివాదం నెలకొంది. ఈ వేడుకలపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన మద్రాస్‌ హైకోర్టు, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పిటిషనర్‌ అభ్యంతరం
చైన్నె కార్పొరేషన్‌ డీఎంకే కౌన్సిలర్‌, న్యాయవాది అయిన కవిగణేశన్‌ ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తన పిటిషన్‌లో జూన్‌ 22న టీవీకే అధ్యక్షుడి పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు, గుర్తులతో విద్యాసంస్థల ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులతో బలవంతంగా పుట్టినరోజు పాటలు పాడించి, నినాదాలు చేయించారన్నారు. 

మరీ ముఖ్యంగా, తిరువళ్లూరు జిల్లాలో దాదాపు 3000 మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి టీవీకే అధ్యక్షుడి ముఖచిత్రం (హ్యూమన్‌ చైన్‌ ఫార్మేషన్‌) వచ్చేలా చేశారని పేర్కొన్నారు. విద్యార్థులను ఇలాంటి రాజకీయ వేడుకలకు ఉపయోగించడం విద్యాసంస్థల మౌలిక ఆశయాలకే విరుద్ధమన్నారు. రాజకీయ, మతపరమైన సిద్ధాంతాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహించరాదని తమిళనాడు ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన జీవో జారీ చేసిందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కఠిన చర్యలకు డిమాండ్‌..
పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలను నిషేధిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అత్యంత కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, విద్యాసంస్థల్లో ఇలాంటి ఉల్లంఘనలకు అనుమతించిన ప్రధానోపాధ్యాయులు, బాధ్యులైన సిబ్బందిపై విచారణ జరిపి వారిని సస్పెండ్‌ చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

న్యాయస్థానం స్పందన
ఈ కేసు మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్‌ జి. అరుళ్‌ మురుగన్‌ నేతత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది జె. రవీంద్రన్‌ వాదనలు వినిపిస్తూ, పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలను అడ్డుకునే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయమూర్తులు, ఈ వ్యవహారంపై స్పందిస్తూ వివరణాత్మక కౌంటర్‌ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement