బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌ | Political Twist In Bengal, Three Former TMC Leaders Get Rajya Sabha Tickets Soon After Joining Party | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

Jul 10 2026 7:08 AM | Updated on Jul 10 2026 10:57 AM

BJPs Big Bengal Move: From TMC Rebels to Rajya Sabha Faces

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో బీజేపీ మరో కీలక వ్యూహానికి తెరలేపింది. ఒకప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలకు తమ తలుపులు మూసేశామని ప్రకటించిన కమలం పార్టీ.. ఇప్పుడు అదే పార్టీ నుంచి వచ్చిన తాజా మాజీలకు వెంటనే పెద్దపీట వేసింది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురిని రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించడం బెంగాల్‌ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

గురువారం కోల్‌కతాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్‌ భట్టాచార్య సమక్షంలో సుఖేందు శేఖర్‌ రే, సుష్మితా దేవ్‌, ప్రకాశ్‌ చికా బరైక్‌లు పార్టీ కండువా కప్పుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి కమలం గూటికి చేరిన ఈ ముగ్గురి పేర్లను.. కొన్ని గంటల వ్యవధిలోనే జులై 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. దీంతో బెంగాల్‌ రాజకీయాల్లో ఈ పరిణామం హాట్‌టాపిక్‌గా మారింది.

‘తలుపులు మూసేశాం’ అంటూనే..
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి తృణమూల్‌ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చిన బీజేపీ.. ఆ పార్టీ నాయకులకు తమ పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు గంటల వ్యవధిలోనే ముగ్గురు మాజీ టీఎంసీ ఎంపీలకు రాజ్యసభ అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది సాధారణ విధానం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని బెంగాల్‌ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలను వేధించని, అవినీతి ఆరోపణలు లేని నేతలను మాత్రమే టీఎంసీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వాములను చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పేర్కొంది.

ఎవరెవరు చేరారంటే..

సుఖేందు శేఖర్‌ రే: 2012 నుంచి తృణమూల్‌ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రే.. ఆర్జీ కర్‌ ఆసుపత్రి ఘటన తర్వాత పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

సుష్మితా దేవ్‌: అస్సాం నుంచి తృణమూల్‌ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సుష్మితా దేవ్‌ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. పార్టీలో అవినీతి తీవ్రతపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సంప్రదింపుల అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రకాశ్‌ చికా బరైక్‌: 2023లో రాజ్యసభకు వెళ్లిన బరైక్‌.. ఉత్తర బెంగాల్‌లో టీ తోటల కార్మికుల మధ్య పార్టీ కార్యకలాపాలతో గుర్తింపు పొందారు.

ఇక రాజ్యసభ ఉప ఎన్నికల సమీకరణాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి. 2026 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 294 మంది సభ్యుల సభలో బీజేపీ 208 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే తృణమూల్‌లో ఏర్పడిన అంతర్గత విభేదాలు రాజ్యసభ ఎన్నికల లెక్కలను పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడంతో.. మూడు రాజ్యసభ స్థానాలను కూడా గెలుచుకునే అవకాశం బీజేపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జరిగే 2-1 పోటీ కాస్తా.. ఇప్పుడు మూడు స్థానాలపై కమలం గురి పెట్టే పరిస్థితి ఏర్పడింది.

బెంగాల్‌లో రాజకీయ పోరు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా.. ఎన్నికలకు ముందే ఆధిపత్యం కోసం సాగుతోంది. తృణమూల్‌ నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా బీజేపీ ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించాలనే వ్యూహంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీలో అసంతృప్తి ఉందనే సంకేతాన్ని ఇవ్వడం.. మరోవైపు తృణమూల్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా తమ స్థాయిని పెంచుకోవడం కమలం పార్టీ ఉద్దేశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజ్యసభలో బలం పెంచుకోవడంతో పాటు.. బెంగాల్‌లో స్థానిక స్థాయిలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా భవిష్యత్‌ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పునాది వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తృణమూల్‌ నుంచి వచ్చిన నేతలను వెంటనే కీలక స్థానాల్లోకి తీసుకోవడం.. గతంలో బీజేపీ చేసిన ‘తలుపులు మూసేశాం’ ప్రకటనతో విరుద్ధంగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement