ఎన్డీయే వైపు శరద్‌ పవార్‌ అడుగులు?  | Sharad Pawar brief meeting with Eknath Shinde at Vidhan Bhavan | Sakshi
Sakshi News home page

ఎన్డీయే వైపు శరద్‌ పవార్‌ అడుగులు? 

Jul 10 2026 5:32 AM | Updated on Jul 10 2026 5:32 AM

Sharad Pawar brief meeting with Eknath Shinde at Vidhan Bhavan

ఏక్‌నాథ్‌ షిండేతో పవార్‌ ఆకస్మిక భేటీ 

బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ 

మహా వికాస్‌ అఘాడీలోనే తమ పార్టీ కొనసాగాలని పట్టు

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఆపరేషన్‌ టైగర్‌’అనంతరం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ‘ఆపరేషన్‌ తుతారీ’చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌చంద్ర పవార్‌) అధికార ఎన్డీయే కూటమిలో చేరుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న కీలక నేతల వరుస సమావేశాలు ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే ఎన్డీయేతో తమ పార్టీ జతకట్టబోతోందన్న వాదనలు, విశ్లేషణలతో శరద్‌ పవార్‌ సోదరుని మనవడు, పార్టీ ఎమ్మెల్యే అయి రోహిత్‌ పవార్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

 బుధవారం విధాన భవన్‌లో ఏక్‌నాథ్‌ షిండేతో శరద్‌ పవార్‌ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రగిలించింది. పవార్‌ విధాన భవన్‌కు చేరుకున్నారన్న సమాచారం అందగానే, షిండే తాను నిర్వహిస్తున్న సమావేశాన్ని కాసేపు పక్కనపెట్టి బయటకు వచ్చి పవార్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, భవిష్యత్‌ రాజకీయ సమీకరణాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవార్, షిండేల భేటీకి ముందే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డేతో ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ సమావేశమయ్యారు. 

రోహిత్‌ పవార్‌ అసహనం 
పార్టీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలపై ఎన్సీపీ         (ఎస్పీ) అంతర్గత వర్గాల్లో ఏకాభిప్రాయం లేదు. బీజేపీతో చేతులు కలపడాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ ఇలాంటి రాజకీయ నిర్ణయాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) పాత మిత్రపక్షాల కూటమి అయిన మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)తోనే కలిసి సాగాలని రోహిత్‌ గట్టిగా వాదిస్తున్నారు. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ త్వరలోనే తన బహిరంగ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. ఆయన తీసుకోబోయే నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శరద్‌ పవార్‌ వేసే తదుపరి రాజకీయ అడుగులు మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

‘ఆపరేషన్‌ తుతారీ’అంటే ఏమిటి? 
అజిత్‌ పవార్‌ తెచ్చిన చీలికతో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం శరద్‌ పవార్‌ వర్గానికి మహారాష్ట్ర సంప్రదాయ బూర అయిన తుతారీ గుర్తును కేటాయించింది. మహారాష్ట్రలో గతంలో శివసేనను చీల్చిన తరహాలోనే, ఇప్పుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) వర్గాన్ని మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో విలీనం చేసుకునేందుకు లేదా ఆ పార్టీ మద్దతు కూడగట్టేందుకు తెరవెనుక జరుగుతున్న రాజకీయ ప్రయత్నాలకే రాజకీయ వర్గాలు ‘ఆపరేషన్‌ తుతారీ’అని పేరు పెట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement