తెలంగాణపై బీజేపీ ఆపరేషన్‌ 2028.. అసలు గేమ్‌ మొదలైందా? | KSR Comments On BJP President Nitin Nabin's Visit To Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణపై బీజేపీ ఆపరేషన్‌ 2028.. అసలు గేమ్‌ మొదలైందా?

Jul 7 2026 10:57 AM | Updated on Jul 7 2026 11:29 AM

KSR Comments On BJP President Nitin Nabin's Visit To Telangana

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.

నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్‌లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.

బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.

గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.

జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కార్పొరేషన్‌లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.

ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్‌గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు, రేవంత్‌లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్‌ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.

మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్‌ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.

చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్‌ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్‌కు మోదీ అప్పాయింట్‌మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.

కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్‌కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement