ఎన్‌డీఏ వైపు శరద్‌ పవార్‌ వర్గం..? | Maharashtra Politics: Jayant Patil Vinod Tawde Meeting Sparks Buzz | Sakshi
Sakshi News home page

ఎన్‌డీఏ వైపు శరద్‌ పవార్‌ వర్గం..?

Jul 8 2026 4:50 PM | Updated on Jul 8 2026 4:59 PM

Maharashtra Politics: Jayant Patil Vinod Tawde Meeting Sparks Buzz

జయంత్‌ పాటిల్, వినోద్‌ తావడే భేటీపై రాజకీయ చర్చ

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారానికి దూరంగా ఉన్న కారణంగా తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్‌డీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో ఎన్సీపీ (శరద్‌ పవార్‌) సీనియర్‌ నేత జయంత్‌ పాటిల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావడే మధ్య సమావేశం జరిగినట్లు సమాచారం.

శరద్‌ పవార్‌ వర్గం అధికారికంగా మహాయుతిలో చేరితే వారికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం, బాధ్యతలు లభించవచ్చనే అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే మహాయుతిలో నేరుగా చేరకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశంపైనా అభిప్రాయాలు పంచుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీతో మహావికాస్‌ అఘాడీలోని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)ను రాజకీయంగా ఒంటరి చేసే వ్యూహంలో భాగంగానే శరద్‌ పవార్‌ అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. తావడేతో సమావేశం అనంతరం జయంత్‌ పాటిల్ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం)కి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మరావ్‌ బాబా అత్రామ్‌ మాట్లాడుతూ.. శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన కనీసం ఐదుగురు ఎంపీలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌ 12లోపు వారి చేరిక జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల కిందట శరద్‌ పవార్, అజిత్‌ పవార్‌ వర్గాల విలీనంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అయితే పరిస్థితులు మారిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి మలుపు తిప్పుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జయంత్‌ పాటిల్, వినోద్‌ తావడే భేటీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

చ‌ద‌వండి: సీఎం ఫ‌డ్న‌వీస్‌కు రాజ్ ఠాక్రే బ‌హిరంగ లేఖ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement