ప్ర‌జ‌ల మ‌ర‌ణాల‌పై వెకిలి న‌వ్వులా? | Raj Thackeray slams CM Fadnavis, BJP central leadership | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత‌ల‌పై రాజ్‌ఠాక్రే ధ్వజం

Jul 4 2026 5:46 PM | Updated on Jul 4 2026 6:15 PM

Raj Thackeray slams CM Fadnavis, BJP central leadership

సీఎం ఫడ్నవీస్‌కు బహిరంగ లేఖ

ముంబై: రాజకీయాల్లో విలువలు, సంస్కారం క్షీణిస్తున్నాయంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, అదే ధోరణి ఇప్పుడు మహారాష్ట్ర రాజ‌కీయాల్లోనూ కనిపిస్తోందని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సున్నిత‌త్వాన్ని కోల్పోయార‌ని, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న మంత్రుల‌ను నియంత్రించ‌లేక‌పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు సీఎం ఫడ్నవీస్‌కు ఎక్స్ వేదిక‌గా శ‌నివారం బ‌హిరంగ లేఖ రాశారు.

''మహారాష్ట్ర రాజకీయాలకు ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఇక్కడి నాయకత్వం ఆలోచనాత్మకంగా, పరిణతితో వ్యవహరించేది.  అయితే గత కొన్నేళ్లుగా ఆ ప్రత్యేకత కనుమరుగవుతోంది. ప్రజల మరణాలపై ఒక ఎమ్మెల్యే వెకిలిగా నవ్వుతూ వ్యాఖ్యలు చేసినా ఆయ‌న‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. “అధికారం అవినీతికి దారి తీస్తుంది, సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతికి దారి తీస్తుంది” అనేలా ప్రస్తుత బీజేపీ నాయకుల ప్రవర్తన ఉంది.

ఫడ్నవీస్‌ను ఒకప్పుడు సున్నిత మనసున్న, సంస్కారవంతమైన ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రజలు భావించారు. నేను కూడా అదే అభిప్రాయంతో ఉండేవాడిని. అయితే ఇటువంటి సంఘటనలపై ఆయన మౌనం పాటించడం వల్ల ఆ అభిప్రాయాన్ని పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బాలాసాహెబ్ ఠాక్రే, శరద్ పవార్, ప్రమోద్ మహాజన్ వంటి నాయకులు రాజకీయ నైతిక విలువలను కాపాడారు. ప్రస్తుతం మాత్రం అధికార పక్ష నేతలు ఎలాంటి తప్పులు చేసినా వారిని కాపాడే ధోరణి పెరిగింది. ఇది మహారాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. మంత్రులు, ఇతర నాయకులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదు.

చ‌ద‌వండి: శివ‌సేన త‌ర‌హా క‌ష్ట‌మే ఆ పార్టీకి!

మీరు ఒకసారి కఠిన చర్యలు తీసుకుంటే అందరూ క్రమశిక్షణలోకి వస్తారు. కానీ మీ మౌనం వల్లే వారు మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రజలు స్పష్టమైన సంకేతాలు, నాయకత్వాన్ని ఆశిస్తున్నారు, ద‌య చేసి ఆ నమ్మకాన్ని దెబ్బతీయకండి. ఇలాంటి వ్యవహారాలపై రాజీనామాలు కోరాల్సిన స్థితిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.  మహారాష్ట్ర రాజకీయాల్లో తప్పు సంప్రదాయాలకు తావివ్వకండి. మీరు వివేకవంతులు. మీపై ఇంకా ప్రజలకు ఆశలు ఉన్నాయ''ని రాజ్‌ ఠాక్రే బ‌హిరంగ లేఖ‌లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
కాగా, మ‌హారాష్ట్ర‌లో గ‌త నాలుగు రోజులగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో స్కూలు బ‌స్సుపై చెట్టు కూలి 11 బాలుడు, మూత లేని మ్యాన్‌హోల్‌లో పడి 60 ఏళ్ల వృద్ధుడు మరణించారు. వీరి మ‌ర‌ణాల మ‌ర‌ణాల‌పై ముంబై బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అమీత్ సతమ్ చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీశాయి. "నిన్న ఒక చెట్టు వల్ల, ఈ రోజు ఒక మ్యాన్‌హోల్ వల్ల...'' అంటూ హేళ‌న‌గా మాట్లాడారు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement